ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 10వ రోజూ భీకరంగా కొనసాగుతోందది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడుతోంది. పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై క్షిపణులతో రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. పర్యాటక ప్రాంతమైన మారియుపోల్కు బలగాలు, ఆహారం, విద్యుత్, నీరు వంటి సదుపాయలను రష్యన్ బలగాలు అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో…ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థంకావడం లేదని ఉక్రెయిన్ పౌరులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ను చేజిక్కించుకునేవరకు తగ్గేదేలేదని, దాడులు మరింత భీకరంగా జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ తమ డిమాండ్లకు తలొగ్గేదాకా వెనక్కు తగ్గబోమని అన్నారు. ఉక్రెయిన్ తో పాటు రష్యాపై ఆంక్షలు విధించిన ఇతర దేశాలనూ పుతిన్ హెచ్చరించారు. తమదేశంపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని, దానికి నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామని, శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని, అందుకే ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పుతిన్ నియంతలా వ్యాఖ్యానించారు. అయితే, పుతిన్ ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ యుద్ధంపై అమెరికా సంచలన ప్రకటన చేసింది. యుద్ధంలో విజయం ఉక్రెయిన్దేనని అమెరికా చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి ప్రసంగం తర్వాత అమెరికా ప్రతినిధి ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.
అమెరికా వంటి అగ్రరాజ్యం సాయం చేస్తే తప్ప రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం గెలిచే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఈ ప్రకటనతో ఉక్రెయిన్ తరఫున అమెరికా బరిలోకి దిగనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే దౌత్యపరమైన ఒత్తిళ్లతో రష్యాకు చెక్ పెట్టే దిశగా అమెరికా అడుగులు వేస్తోందా అన్న విషయం తేలాల్సి ఉంది.