కరోనా కట్టడిలో ప్రధాని మోడీ విఫలమయ్యారంటూ అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోన్న సంగతి తెలిసిందే. 5 రాష్ట్రాల ఎన్నికలు..ప్రత్యేకించి బెంగాల్ లో దీదీని ఓడించేందుకు విపరీతమైన ప్రచారం, కుంభమేళా వంటి పలు అంశాలపై ఫోకస్ పెట్టిన మోడీ….కరోనా సెకండ్ వేవ్ , వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏ మాత్రం ఫోకస్ చేయలేదని, అందుకే భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోందని ఏకిపారేస్తున్నారు.
ఇక, భారత్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో వివక్ష చూపుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులపై సీఎంలతో మాట్లాడుతున్న ప్రధాని మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ విమర్శలు గుప్పించారు. అయితే, సోరెన్ విమర్శలతో ఏ మాత్రం సంబంధం లేని ఏపీ సీఎం జగన్…వాటిపై స్పందించారు.
కరోనా కష్టకాలంలో ప్రధానికి అందరూ అండగా నిలవాలని, రాజకీయాలకు ఇది సమయం కాదని జగన్ హితవు పలికారు. దీంతో, జగన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై ఉన్న కేసులకు భయపడి మోడీకి జగన్ దాసోహం అయ్యారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ వ్యాఖ్యలపై ఝార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) దీటుగా జవాబిచ్చింది.
జగన్ కంటే ఝార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి ఉన్న నేత అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే జగన్ ఆ విధంగా స్పందించారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీకి దగ్గరయ్యేందుకే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. ఏపీకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని, కానీ కేంద్రం వైఖరితో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.
మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్‌కు జేఎంఎం చురకలంటించింది. అంతేకాదు, మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం వైఎస్ జగన్.. అవును, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తాం.. మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది. ట్వీట్‌కు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదాపడిన న్యూస్‌ను ట్యాగ్ చేసింది.