ప్రపంచాన్ని వణికించిన కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా కేసుల తీవ్రత మాత్రం తగ్గని పరిస్థితి. కొన్నిచోట్ల థర్డ్ వేవ్.. మరికొన్నిచోట్లసెకండ్ వేవ్ దెబ్బకు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ మీద ఉన్న అనుమానాలు కూడా.. వ్యాక్సినేషన్ మీదా.. కరోనాను కంట్రోల్ చేసే విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తుందని చెప్పాలి.
ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ ఏదైనా కానీ రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ వేసుకున్న 26 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో రెండో డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్ని వ్యాక్సిన్లురెండు డోసులు వేసుకోవటం తప్పనిసరి. అయితే.. అందుకు భిన్నంగా ప్రఖ్యాత జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన టీకాకు మాత్రం ఒక్క డోసు సరిపోతుందని చెబుతున్నారు.
దీని వినియోగానికి అమెరికా అనుమతిని ఇచ్చింది. ఇప్పటివరకు అమెరికాలో ఫైజర్.. మోడెర్నా టీకాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి టీకా అనుమతులు రావటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరు తుదిదశకు చేరుకుందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా అనుమతి వచ్చిన వ్యాక్సిన్ అమెరికా ప్రజలందరికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
కొత్త వ్యాక్సిన్ ను అన్ని విధాలుగా పరీక్షించి.. రకరకాల ప్రయోగాల్ని నిర్వహించిన తర్వాతే దాని పని తీరుకు సంతృప్తి చెందాకే అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. వీలైనంత త్వరగా దేశంలోని అత్యధికులకు వ్యాక్సిన్ డోసులు ఇస్తేనే.. కరోనాకు చెక్ పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజాగా అనుమతులు లభించిన జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదిగా.. సామర్థ్యాన్ని కలిగినదిగా తేలింది. 85 శాతం సామర్థ్యంతో ఈ వ్యాక్సిన్ పని చేస్తుందన్న విషయాన్ని వివిధ ప్రయోగాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. మరో సానుకూలాంశం ఏమంటే.. ఈ వ్యాక్సిన్ ను నిల్వ చేయటం చాలా సులువు. సాధారణ రిఫ్రజిరేటర్లలో కూడా దీన్ని మూడు నెలల పాటు నిల్వ ఉంచే వీలుందని చెబుతున్నారు.