ఏపీ సీఎం ఏం చేస్తారంటే… బటన్ నొక్కి వైసీపీ కార్యకర్తలకు డబ్బులేస్తారు అని సెటైర్లు పేలుతుంటాయి. దేశమంతా నవ్వుకున్నా, విమర్శించినా, తప్పుపట్టినా… తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనుకునే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది సీఎం జగనే.
ఏపీలో అతి ముఖ్యమైన విషయాలన్నిటినీ పక్కనపెట్టి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం, మటన్ షాపులు, ఫిష్ షాపులు పెట్టడం, జనాలకు ఇసుక దొరక్కుండా చేయడం, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం వంటి విచిత్రమైన పనులు చేస్తూ ప్రజల్లో తీవ్రంగా అభాసు పాలవుతున్నారు జగన్.
కానీ జనం ఎంత మొత్తుకున్నా పెట్రోలు రేటు మాత్రం తగ్గించడు, ఇసుక ఇవ్వడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్రోలు డీజిలు ధరలు తగ్గించాయి. ఇందులో పక్కనున్న కర్ణాటక కూడా ఉంది. కానీ పెట్రోలు రేటు తగ్గించకపోగా నేను తగ్గించను అని కోట్లు ఖర్చుపెట్టి ప్రకటన ఇచ్చిన ఘనుడు వైఎస్ జగన్.
అయితే, దానిమీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ ఆదాయం లేక దానిని తగ్గించలేకపోయాడు. కానీ తాజాగా జార్ఖండ్ సీఎం దేశమంతటినీ షాక్ కు గురిచేసే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి జగన్ కి పెద్ద తలనొప్పి వచ్చిపడింది.
ఎవడో కట్టిన ట్యాక్స్ సొమ్ముతో తమ పార్టీకి ఓట్లు తెచ్చుకునేందుకు డబ్బును దుబారా చేసే తెలుగు సీఎంలకు దిక్కుతోచని విధంగా చేశాడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. సదరు సీఎం మాదిరి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయరు? అన్న చర్చ షురూ అయ్యేలా మారింది.
ఇంతకూ ఆయన ప్రవేశ పెట్టిన తాజా పథకం ఏమిటంటే.. లీటరు పెట్రోల్ మీద రూ.25 తగ్గింపును ప్రకటించారు. లీటరు పెట్రోల్ సెంచరీ దాటేసిన వేళ.. ద్విచక్ర వాహనదారులు మొదలు కార్ల యజమానుల వరకు పెట్రోల్ బిల్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు సైతం టూ వీలర్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారికి రోజువారీ పెట్రోల్ బిల్లు ఇబ్బందిగా మారింది. ఇలాంటి వారి బాధలను జార్ఖండ్ ముఖ్యమంత్రి గుర్తించినట్లున్నారు.
లీటరు పెట్రోల్ మీద రూ.25 చొప్పున తగ్గిస్తున్నామని ప్రకటించారు. కాకుంటే.. ఈ అద్భుత వరాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంలో ఈ పథకాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇక్కడో కండీషన్ పెట్టారు. ఈ తగ్గింపు టూ వీలర్ వినియోగదారులకు మాత్రమే అమలు చేయనున్నారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
పెట్రోల్.. డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోవడంతో పేదలు.. మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. అందువల్ల రాష్ట్ర స్థాయిలో టూవీలర్ వినియోగదారులకు వెసులుబాటు కలిగేలా లీటరు పెట్రోల్ మీద రూ.25 చొప్పున ఉపశమనం కలిగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
పథకాల మీద పథకాల్ని అమలు చేసే కేసీఆర్.. జగన్ లు.. సోరెన్ మాదిరి ఎప్పుడు ఆలోచిస్తారో? దళితులకు రూ.10 లక్షలు ఇస్తాననే పెద్ద మనిషి.. లీటరు పెట్రోల్ మీద రూ.25 చొప్పున తగ్గిస్తే.. లక్షలాది మంది సామాన్యులు తమ బతుకు బండిని మరింత తేలిగ్గా లాగే వీలుంది. మరి.. హేమంత్ సోరెన్ స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్.. జగన్ లు ఇదే తరహాలో తగ్గింపు ప్రకటన చేస్తే బాగుంటుంది కదా?