పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలవరం డ్యామ్ నిర్మాణానికి మాత్రమే 2013 -14 లో పేర్కొన్న అంచనాల ప్రకారమే నిధులు చెల్లిస్తామని కేంద్రం చెప్పడంతో జగన్ సర్కార్ ఖంగుతింది. ముఖ్యంగా, పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం ఖర్చు ఒక్క రూపాయి కూడా చెల్లించబోదని కేంద్రం తేల్చి చెప్పడంతో ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితి. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి దాదాపు 33 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని గతంలో అంచనా వేశారు. అయితే, ఇప్పటివరకు పునరావాసం కోసం రూ.3500 కోట్లు ఖర్చు చేసి 19.85శాతం పనులు పూర్తి చేశారు. కేంద్రం చెప్పినట్టు నిర్వాసితులకు నిధులివ్వకుంటే ఏపీ సర్కార్ పై మిగిలిన రూ.29 వేల కోట్ల భారం పడనుంది. అయితే, జగన్ సర్కార్ ప్రస్తుత పరిస్థితుల్లో అంత డబ్బు నిర్వాసితులకు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దీంతో, విభజన చట్టంలో యూపీఏ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం పునరావాసానికి అయ్యే ఖర్చును కూడా భరించాలని జగన్ సర్కార్ డిమాండ్ చేస్తోంది. కానీ, మోడీ సర్కార్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
పోలవరంపై కేంద్రం వైఖరికి జగన్ చర్యలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ‘జగనన్న’ ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలు ఏపీ సర్కార్ కు ఇరకాటంగా మారాయని జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ లో సీఎం హోదాలో , నేడు పీఎం హోదాలో మోడీ ఏ పథకం ప్రవేశపెట్టినా…అందులో ప్రజలను కూడా భాగస్వాములను చేసి వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తారు. కానీ, జగన మాత్రం అన్నీ ఫ్రీ అనడం మోడీకి నచ్చలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నవరత్నాల పేరుతో ప్రజలకు రూ.70 వేల కోట్లు పంచామని జగన్ సర్కార్ చెబుతోంది. దీనికితోడు కేంద్రం పథకాలకూ జగన్ పేరు వాడేస్తుండడంతో కేంద్రం ఏపీని ధనిక రాష్ట్రమని భావిస్తోందట.
అంతేకాకుండా, ఇసుక, మద్యం, ఆవ భూములు వంటి వ్యవహారాల్లో ఏపీ సర్కార్ అవకతవకలకు పాల్పడిందని జాతీయ స్థాయిలో నిఘావర్గాలు మోడీకి సమాచారమిచ్చాయని టాక్ వస్తోంది. రాష్ట్రానికి వచ్చిన అన్ని నిధులను నవరత్నాలకోసం జగన్ వాడేసి ఆ క్రెడిట్ ను వ్యక్తిగతంగా కొట్టేస్తున్నారన్న భావన మోడీకి ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే, పోలవరం నిర్వాసితుల వ్యవహారంలో కేంద్రం మొండివైఖరి అవలంబించిందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబుపై మోడీకి నమ్మకముందని, అందుకే ఏపీకి సందర్భానుసారంగా అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, ఇపుడు నిధులు ఇస్తే జగన్ దుర్వినియోగపరుస్తారేమోనన్న అనుమానంతోనే ఇలా కేంద్రం మొండి చేయి చూపుతోందని అనుకుంటున్నారు. ఈ రకంగా జగన్ వ్యవహార శైలితో ఏపీకి నష్టం జరుగుతోందని పలువురు రాజకీయ మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.