హుజురాబాద్ ఉప ఎన్నికలపై ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడంతో టీఆర్ ఎస్ లో అంతర్మథనం మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 865 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించడంతో సీఎం కేసీఆర్ పై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
ఈటలకు 30వేల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పడం చర్చనీయాంశమైంది. తమ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడంపై విశ్లేషణ చేయకుండా…పక్క పార్టీల అభ్యర్థుల మెజారిటీలను కాంగ్రెస్ నేతలు లెక్కిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇలా ఉంటే కాంగ్రెస్…జోస్యాలు చెప్పుకునే పార్టీగా మిగులుతుందని విమర్శలు వచ్చాయి. అయితేనేం, తాజాగా మరో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి…కోమటి రెడ్డి తరహాలోనే చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశమయ్యాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కేసీఆరే కారణమని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స్వయంకృతాపరాధంతోనే బీజేపీ గెలిచిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్…ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని అన్నారు. దీని వల్ల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా ఈటల రాజేందర్ కు లాభం జరిగిందన్నారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుంటే టీఆర్ఎస్ గెలిచేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఇక, 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమవుతుందని జీవన్ రెడ్డి చెప్పారు. అయితే, జీవన్ రెడ్డి కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెగిరందన్న చందంగా కాంగ్రెస్ నేతల మాటలున్నాయని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. సొంత పార్టీలో ఐక్యంగా ఉండి….ఉన్న అభ్యర్థులు పక్క పార్టీలోకి పోకుండా కాపాడుకోకుండా పక్క పార్టీ గెలుపునకు కారణాలు విశ్లేషించడంపై సెటైర్లు వేస్తున్నారు.