అకారణంగా టీడీపీ నేతలపై, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని అనంతపురం టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగురోజుల క్రితం తాడిపత్రిలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు. అయితే, తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉందని, అయినా అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారని ఆరోపిస్తూ జేసీతోపాటు మరో 120 మంది జేసీ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రి డీఎస్సీపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసన వ్యక్తం చేయడానికి కూడా పర్మిషన్ లేదంటున్నారని డీఎస్పీపై ఆయన ఫైర్ అయ్యారు. మీ స్టాఫ్ లో ఎస్సీలు లేరా…ఉంటే కేసు పెట్టించు అని సవాల్ విసిరారు. 70 ఏళ్లు నాకు..నా ఫ్యూచర్ ఏమీలేదు…నీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకో….భయపడేది లేదు అంటూ ఛాలెంజ్ చేశారు.
వినాయక చవితికి పర్మిషన్ లేదంటావు, దేనికీ అనుమతి లేదంటావు..మరి వైసీపీ వాళ్లకు అనుమతి ఎలా ఇస్తున్నావు అని ఆయన నిలదీశారు. నీ స్టార్లు నీకుంటయి..నా స్టార్లు..నాకుంటయి…ఏమైనా మాట్లాడతా…నువ్వు తొత్తువి…నువ్వుకూడా గోరంట్ల మాధవ్ లాగా సీటు కోసం ప్రయత్నిస్తున్నావు అంటూ మండిపడ్డారు. నన్ను ఎదిరించినావని చెప్పుకొని కాకినాడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లున్నావు..అని షాకింగ్ ఆరోపణలు చేశారు. కథ చానా ఉంది..మొత్తం చెబుతా…ఉతికే రోజు మావాళ్లు అట్లా ఇట్లా ఉతకరు…దీనికి నువ్వే బాధ్యుడివి అంటూ మండిపడ్డారు.
కాలుస్తావా కాల్చుకో..ఆడపిల్లలందరితో అవమానకరరీతిలో మాట్లాడావు….నువ్వు చంద్రబాబుకు పుట్టినావా..అని అడిగావు అంటూ ఫైర్ అయ్యారు. ఇంట్లో ఆడవాళ్లని…అమ్మా అక్కా అని తిడతావా…నీకెంత చెడ్డపేరుందో తెలుసా అనంతపురంలో..నువ్వో సైకోవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమ్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ…దీనిమీద కూడా కేసు రాసుకో..రా చూపిస్తా… అంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జేసీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.