ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదం ముదిరి పాకానబడిన సంగతి తెలిసిందే. ఈ జల వివాదం నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, దివంతగ నేత వైఎస్ఆర్ పై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. అయితే, వైఎస్ఆర్ ను వారు దూషిస్తున్నా… వైసీపీ నేతలెవరూ దీటుగా, ఘాటుగా స్పందించలేదు. తెలంగాణలో ఆంధ్రావారున్నారు కాబట్టి తాను ప్రతి విమర్శ చేయడం లేదని జగన్ చేతులు దులుపుకున్నారు.
ఒకరిద్దరు మంత్రులు మాత్రం నామమాత్రంగా విమర్శించి వదిలేశారు. ఇక, తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఎవరితో అయినా పోరాడటానికైనా సిద్ధమని తెలంగాణలో పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిల ప్రకటించారు. తన తండ్రి వైఎస్ ను తిడుతున్నప్పటికీ…టీఆర్ఎస్ నేతలను షర్మిల పల్లెత్తు మాటనకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు వైఎస్ ద్రోహం చేశారని, రాక్షసుడు అని వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వైెఎస్ఆర్ వంటి పెద్దమనిషిని బండ బూతులు తిడుతుంటే ఏపీ మినిస్టర్లు గాజులు తొడుక్కున్నారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని, తమ పిల్లలు హైదరాబాద్లోనే పుట్టారని..అక్కడే చదువుకున్నారని వారంతా తెలంగాణ ప్రజలేనని అన్నారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని అన్నారు.
షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించబోతున్నారని, అక్కడ షర్మిలను పూలతో సన్మానిస్తున్నారని అని ప్రశ్నించారు. చేతకాని తనంతో మమ్మల్ని భయపెడతావా? అంటూ జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వేల కోట్ల ఆస్తులు ఆంధ్ర వాళ్ళవి ఉన్నాయని, ఎవరూ ఏమీ అనరని, అదంతా అభూత కల్పన అని అన్నారు. నీళ్లు వస్తాయంటే కలిసి పోరాడుతామని, కల్లబొల్లి మాటలు వద్దని అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఒత్తిళ్లపై కూడా జేసీ స్పందించారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బూతులు తిడుతున్నారని.. సిట్టింగ్ ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలని లేకుంటే పరిస్థితి బాగుండదని వారికి చెబుతున్నట్లు తనకు తెలిసిందని జేసీ చెప్పుకొచ్చారు.