శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో టీడీపీ కీలక నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టీడీపీ మరో కీలక నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తన అనుమతి లేకుండా పుట్టపర్తిలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి రావడంపై పల్లె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పుట్టపర్తిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
చివరికి పోలీసులు రంగంలోకి దిగి జేసీని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడిపత్రి నియోజకవర్గంపై పట్టున్న జేసీ ప్రభాకర్ రెడ్డి… తన నియోజకవర్గం పుట్టపర్తిలోకి తన అనుమతి లేకుండా వస్తున్నారంటూ పల్లె రఘునాథరెడ్డి చాలా కాలం నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారంనాడు సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పుట్టపర్తికి జేసీ బయలుదేరారు.
ఈ క్రమంలోనే పల్లె వర్సెస్ జేసీ అనుచరుల మధ్య గొడవ తప్పదన్న ప్రచారం జరిగింది. దీంతో, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశముందన్న సమాచారమందుకున్న పోలీసులు పుట్టపర్తిలో జేసీని అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా మరూర్ టోల్ గేట్ దగ్గర జేసీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభాకర్ రెడ్డి పుట్టపర్తికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, అందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డిని పట్టణం నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.