ఏపీ రాజధాని అమరావతేనని, ఆరు నెలల్లోపు మాస్టర్ ప్లాన్ రెడీ చేసి అమరావతిని డెవలప్ చేయాలని జగన్ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక, మంత్రి బొత్స అయితే మరో అడుగు ముందుకు వేసి….గట్టిగా మాట్లాడితే 2024 వరకు ఏపీకి కూడా హైదరాబాదే రాజధాని అని కొత్త పల్లవి అందుకున్నారు.
దీంతో, జగన్ ను హైదరాబాద్ నుంచి పాలన సాగించాలంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. మంత్రి బొత్స మళ్లీ హైదరాబాద్ రావాలనుకుంటున్నారని, ఇక్కడే మరో రెండేళ్లు ఉండాలన్న ఆలోచన బొత్సకున్నట్లుందని అన్నారు. ఏపీలో ఒకటి కాకపోతే10 రాజధానులు కట్టుకోవచ్చని, అదంతా జగన్ ఇష్టమని తనదైన శైలిలో జేసీ సెటైర్లు పేల్చారు.
తాజా పరిణామాలు చూస్తుంటే జగన్ 3 రాజధానుల వ్యవహారాన్ని వదిలేసినట్లే కనపడుతోందని జేసీ అన్నారు. ఈ క్రమంలోనే బొత్స ఇలా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. సీఎంలను కలిసే విషయంలో గతంలోలా పరిస్థితులు లేవని జేసీ కుండబద్దలు కొట్టేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను కలుద్దామనుకున్నానని, కానీ, వీలు పడట్లేదని చెప్పారు. ఇక, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు.