అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. మనసులో అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం జేసీకి అలవాటు. స్వపక్షమైనా, ప్రతిపక్షమైనా…పొగడ్తయినా…విమర్శయినా….వివాదాస్పద వ్యాఖ్య అయినా… ఒన్స్ జేసీ మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా అనేస్తారు. అయితే, 2019 ఎన్నికల తర్వాత పెద్దగా మీడియా ముందు కనబడడం లేదీ ఫైర్ బ్రాండ్ నేత.
సీఎం జగన్ మా వాడు అంటూ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ…తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యులకు చెందిన గనులను క్లోజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కక్ష సాధింపులో భాగంగానే ఇది చేయిస్తున్నారని ప్రభుత్వంపై జేసీ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పటి వరకూ జేసీ దివాకరరెడ్డిని ప్రభుత్వం టచ్ చేయలేకపోయిందని, బహుశా తానెప్పుడూ జగన్‌ను.. మా వాడు.. మా వాడు అన్నందుకే ఏమీ చేయలేదేమోనని అన్నారు.
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జేసీ వైసీీపీ ప్రభుత్వంపై తన మార్క్ కామెంట్లు చేశారు. తన కుటుంబంతో దూరంగా ఉంటున్నానని, లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, చెల్లి పేరుతో గనులున్నాయని, వాటిని శోధించడానికి 50 నుంచి 60 మంది వెళ్లారని అన్నారు. వైజాగ్ నుంచి నక్సలైట్లు గనుల్లోకి వెళితే వారికోసం పోలీసులు కూంబింగ్‌కు వచ్చారని అనుకున్నానని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు చాలా మంది నేతల గనులున్నప్పటికీ తన భార్య పేరుతో ఉన్న గనులను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇప్పటికే తన కుటుంబాన్ని కక్ష సాధింపులో భాగంగా ఎన్నో బాధలు పెట్టారని,ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి లోపల వేస్తున్నారని, తన సోదరుడిని అరెస్టు చేశారని…ఆరోపించారు.
ఈ గనులు తప్ప తనకు ఇతర ఆస్తిపాస్తులేమీ లేవని, గనుల నుంచి వచ్చే ఆదాయంతోనే అన్నం వండుకుని తింటున్నామని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు పెరాలసిస్ అని, నడవలేని పరిస్థితిలో ఉందని జేసీ బాధపడ్డారు. పర్మిట్లు కావాలంటే మీ నాయకుడికి చెప్పు.. మీ అబ్బకు చెప్పు అన్నట్లుగా ఆఫీసు నుంచి వెళ్లారని జేసీ ఆరోపించారు.
మైనింగ్ పర్మిట్ల కోసం వస్తే ఏడీ గారు లేరని చెబుతున్నారని, పర్మిట్ల కోసం మరోసారి వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. . మైనింగ్‌కు పర్మిట్ ఇవ్వకపోతే పస్తులతో పైకి పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులు సత్కారం చేయడానికి రెడీగా ఉన్నారని, తనకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి రుణం తీర్చుకుంటామని జేసీ హెచ్చరించారు.