బాలీవుడ్ హాట్ బ్యూటీ, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో యమా జోరు చూపిస్తోంది. ఆల్రెడీ జాన్వీ చేతిలో రెండు తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో దేవర ఒకటి కాగా.. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్టర్ చేస్తున్న దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
అలాగే తెలుగులో జాన్వీ కపూర్ చేస్తున్న మరొక చిత్రం ఆర్సీ 16. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఇటీవలె ఈ మూవీ పట్టాలెక్కింది. అయితే ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉండగానే జాన్వీ కపూర్ టాలీవుడ్ లో తన మూడో ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. న్యాచురల్ స్టార్ నానితో జాన్వీ కపూర్ ఫిల్మ్ సెట్ అయినట్లు తెలుస్తోంది.
దసరా మూవీతో నానికి బిగ్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమైన శ్రీకాంత్ ఓదెల.. తన తదుపరి చిత్రాన్ని కూడా నానితోనే చేయబోతున్నాడట. ఇప్పటికే నానికి కథ చెప్పడం.. ఆయన ఓకే చేయడం జరిగిపోయాయట. వీరి కాంబో ప్రాజెక్ట్ ను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. అలాగే శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ ఫిల్మ్ లో నానికి జోడిగా జాన్వీ కపూర్ ఎంపిక అయిందని బలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని అంటున్నారు.