కీలక నాయకులను వదులుకుంటే పరిస్థితి ఎలా ? ఉంటుందనేది అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు తెలిసి వస్తోంది. అందునా.. కీలక ఎన్నికల సమయంలో కావడంతో పార్టీకి పెద్ద ఎత్తున ఇబ్బందిగా కూడా మారింది. బీసీ నాయకుడిగా.. యాదవ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి.. వైసీపీకి ఎంతో శ్రమించారు. పార్టీ కోసం అహరహం కష్టపడ్డారు. 2019లో బీసీలు వైసీపీకి అనుకూలంగా మారడం వెనుక జంగా కృషిని ఎవరూ తక్కువ చేసి చూడలేరు.
అలాంటి జంగా.. 2019 ఎన్నికల సమయంలో గురజాల టికెట్‌ను కాసు మహేష్‌రెడ్డి కోసం త్యాగం చేశారు. అంతేకాదు..ఆయనను కూడా గెలిపించారు. నియోజకవర్గంలో గడపగడపకు తిరిగి.. కాసు కోసం పనిచేశా రు. అయితే.. ఆ తర్వాత.. కాసు నుంచే అనేక అవమానాలు ఎదురయ్యాయి. అయినా.. దిగమింగుకుని పార్టీ కోసం ఉన్నారు. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం గురజాల టికెట్‌ను తనకే ఇవ్వాలని ఈ దఫా ఎన్నికల్లో పట్టుబట్టారు. కానీ, జగన్ వినిపించుకోలేదు.
టిక్కెట్ సంగతి ఇలా ఉంచితే కనీసం ఈ ఐదేళ్లలో తనకు కాసు మహేష్ గౌరవం కూడా ఇవ్వలేదని జగన్‌కు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచిబయటకు వచ్చిన జంగా.. టీడీపీలో చేరిపోయారు. నిజానికి టీడీపీకి – జంగాకు మధ్య కొన్నేళ్లుగా వైరం ఉంది. అయినప్పటికీ.. ఆయన వైసీపీలో అవమానాలు భరించలేక టీడీపీ చెంతకు చేరుకుని గురజాల మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ అభ్యర్తి యరపతినేని శ్రీనివాసరావు విజయం కోసం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రతిఒక్కరికీ.. వైసీపీ చేసిన అవమానాన్ని.. అన్యాయాన్ని వివరిస్తున్నారు.
దీంతో గురజాల ముఖ చిత్రం మారిపోయింది. ఆది నుంచి వైసీపీ కోసం పనిచేసిన జంగా కు అన్యాయం జరగడంతో కేడర్ అంతా ఇప్పుడు ఆయన వెనుకే నడుస్తోంది. ఇది గురజాలలో వైసీపీకి భారీ దెబ్బపడేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే చాలా కులాలు, వర్గాలు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి దూరం కాగా.. ఇప్పుడు బీసీలు అందరూ కట్టకట్టుకుని టీడీపీ వైపు వచ్చేస్తున్నారు.
బీసీలు అయితే తమ సత్తా ఏంటో కాసుకు ఎన్నికలలో చూపిస్తామని… ఎన్నికలకు ముందే కాసుకు చలీ జ్వరం వచ్చేలా చేస్తామని సవాళ్లు రువ్వుతున్నారు. కేడర్ అంతా జంగా వైపు ఉండడం. జంగా టీడీపీ వైపు ఉండడం తో ఇప్పుడు వైసీపీలో జై కొట్టేవారు.. జెండా పట్టేవారు బాగా తగ్గిపోవడంతో పాటు గురజాల వైసీపీ పరిస్థితి రోజు రోజుకు ఘోరంగా మారుతోందనే టాక్ వచ్చేసింది.