రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు జనసేనాని. జనసేన నిర్వహించిన కౌలు రైతు భరోసా, జన వాణి కార్యక్రమాలకు అనూహ్య స్పందన రావడంతో తాజాగా ‘యువ శక్తి’ పేరుతో బహిరంగ సభలు నిర్వహించేందుకు పవన్ రెడీ అవుతున్నారు.
రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళ మెత్తడానికే ‘యువ శక్తి’ సభలు నిర్వహించబోతున్నారు. యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసేందుకే పలు జిల్లాల్లో ‘యువ శక్తి’ సభలు జరపాలని జనసేనాని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో ‘యువశక్తి’ తొలి సభ నిర్వహించబోతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ నెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో భారీ సభ జరగనుందని చెప్పిన పవన్… ఈ ప్రకారం యువశక్తి సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
స్వామి వివేకానంద జయంతి రోజున, ఆయన స్ఫూర్తితో జనసేన యువశక్తి కార్యక్రమం చేపడుతున్నామని, రాష్ట్రంలోని యువ గళం వినిపించేలా ఈ సభ ఉంటుందని పవన్ తెలిపారు. యువతీయువకులంతా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని పవన్ పిలుపునిచ్చారు. దేశానికి వెన్నెముక యువతేనని, ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం మనదేనని పవన్ చెప్పారు. కానీ, ఉత్తరాంధ్రలో యువత చదువులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ అంశాలపై యువత తమ అభిప్రాయాలు తెలియజేసేలా ఈ సభ ఉంటుందని పవన్ వివరించారు. ఈ సభలో తాము మాట్లాడడం కాదని, యువత అభిప్రాయాలను వారి నోటి ద్వారానే ప్రపంచానికి తెలియపరుస్తామని చెప్పారు.
రణస్థలంలో " యువశక్తి " తడాఖా
జనసేన యువ శక్తి, జనవరి 12 2023, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా. pic.twitter.com/IPqfMC4X8R
— JanaSena Party (@JanaSenaParty) January 2, 2023