జనసేన అధినేత కొండగట్టు పర్యటన మీద భారీ అంచనాలు పెరిగేలా మారింది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్. యాక్షన్ మూవీకి ఏ మాత్రం తగ్గని రీతిలో ఉన్న ఈ పోస్టర్.. పవన్ కొండగట్టు పర్యటన మీద భారీగా అంచనాలు పెంచేలా మారింది. ఏపీలో తన రాజకీయ పర్యటనలకు అవసరమైన రీతిలో తయారు చేయించిన ‘వారాహి’ వాహనం గురించి తెలిసిందే. ఈ వాహన డిజైన్.. దీనికి పెట్టిన పేరుపై జరిగిన చర్చ.. దానిపై ఏపీ అధికారపక్షం వైసీపీ, జగన్ అండ్ కో స్పందించిన వైనంపై భారీగా చర్చ సాగింది.
వారాహి డిజైన్ పైన భారీగా చర్చ సాగటం.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ స్పందిస్తూ.. వారాహి వాహనం నిబంధనలకుతగ్గట్లే ఉందని.. దాని రంగు పైన నెలకొన్న సందేహాల్ని తీర్చేశారు. ఆ తర్వాత కూడా ఏపీ మంత్రులు మాత్రం వారాహిని రాష్ట్రంలోకి రాకుండా అడ్డకుంటామంటూ పేర్కొన్న వైనంపై జగన్ సర్కారు విమర్శల పాలైంది.
ఇటీవల పలు సందర్భాల్లో వారాహితో ఏపీ పర్యటన ఉంటుందన్న విషయాన్నిపవన్ కల్యాణ్ స్పష్టం చేయటం తెలిసిందే.
ఆయన చెప్పినట్లే.. ఈ నెల 24న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒకప్రకటనను తాజాగా విడుదల చేసిన జనసేన.. వారాహి పూజా కార్యక్రమానికి కొండగట్టుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. పవన్ పిలుపు ఇచ్చిన తర్వాత జనసందోహానికి కొదవ ఉండని పరిస్థితి.
వారాహితో ఆయన తన రాజకీయ ఎజెండాను ఏ విధంగా ప్రకటిస్తారు? తెలంగాణలో ఆయన రాజకీయ ఎత్తులు ఎలా ఉండనున్నాయన్న విషయంపై కొండగట్టు పర్యటనతో స్పష్టత వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. కొండగట్టు పోస్టర్ అదిరేలా ఉన్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమంపై అంచనాలు భారీగా పెరిగాయని మాత్రం చెప్పక తప్పదు.