ఏపీ అధికార పార్టీ వైసీపీపై జనసేన విరుచుకుపడింది. వైసీపీ అధినేత సీఎం జగన్ ను తుగ్లక్ అంటూ.. వ్యాఖ్యానించింది. ఇక, ఇదేసమయంలో ఆయన సోదరి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిలపైనా నిప్పులు చెరిగింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మరింత అగ్గిరాజుకున్నట్టయింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. మిత్రపక్షంగా రంగంలోకి దిగింది.
అయితే.. జనసేనపై వైసీపీ అనుకూల మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. బీజేపీకి దాసోహం అ య్యారని, 24 స్థానాల కోసం పట్టుబట్టి.. 8 స్థానాలను వారి దయతో తెచ్చుకున్నారని, సీఎం కేసీఆర్ను పన్నెత్తు మాట కూడా అనడంలేకపోతున్నారని.. జనసేన అధినేతపై చెప్పులతో దాడి జరిగిందని.. ఇలా అనేక రూపాల్లో వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. దీనిపైనే జనసేన ఫైర్ అయింది.
కనీసం మేం 8 స్థానాల్లో అయినా.. పోటీ చేస్తున్నామని, మీరు అది కూడా చేయలేక పోయారని.. జనసేన పార్టీ విరుచుకుపడింది. “మానుకోటలో కుక్కను కొట్టినట్టు కొడితే .. పారిపోయిన పిరికి పంద తుగ్లక్ జగన్. తెలంగాణను పొడిచేస్తానన్న బాణం అక్క.. అడ్రస్ లేకుండా పోయారు. వారితో పోలిస్తే.. బర్రెలక్క బెటర్“ అని జనసేన కామెంట్ చేసింది. ప్రస్తుతం జనసేన 8 స్థానాలలో పోటీ చేస్తుండగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం గమనార్హం.