రాజకీయం ఎలా ఉన్నా జగన్ కు జనసేనకూ వైరం మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. జనసేన రానున్న కాలంలో ప్రత్యక్ష పోరు మరింత ఉద్ధృతం చేసేందుకు సిద్ధం అవుతోంది. దీనికి తార్కాణంగానే ఇవాళ పవన్ కార్యకర్తల భాష కూడా ఉంది. పదే పదే చంద్రబాబు దత్త పుత్రుడు అని అంటున్నారు కదా ! కానీ సీబీఐ దత్తపుత్రుడు ఎవరో ఈ రాష్ట్ర ప్రజానీకానికే తెలుసు అని మరోసారి వ్యాఖ్యానించారు. తమ అధినేత పవన్ ను విమర్శించే హక్కు కానీ అర్హత కానీ జగన్ వర్గానికి లేదని పేర్కొంటూ, రాష్ట్రంలో పాలన సాగుతున్న తీరుపై తిరుపతి కేంద్రంగా పనిచేసే జనసైనికులు మండిపడుతున్నారు. సీబీఐ దత్తపుత్రుడు ఒక విమర్శ చేస్తే పది విమర్శలు చేస్తాం అని అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి గతం ఏంటో.. గత చరిత్ర ఏంటో ప్రజల ముందు పెడతాం అని చెబుతూ, సీబీఐ అనుమతి లేనిదే దేశం దాటలేని వాళ్ళా సుద్దులు చెప్పేది అని ఫైర్ అవుతున్నారు. దీంతో జనసేనకూ, జగన్ సేనకూ మధ్య యుద్ధం మళ్లీ రాజుకుంది. జగన్ రెడ్డిని జైల్ రెడ్డి అంటూ విమర్శిస్తూ పెద్ద వాగ్యుద్ధానికే తెరలేపారు. ఈ మేరకు వీళ్లంతా తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి భరోసా ఇస్తూ తమ అధినేత 30 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయల చొప్పున అందిస్తున్నారని చెబుతూ, జగన్ అవినీతి కేసుల గురించి మరోమారు ప్రస్తావించారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామన్నారు.
గడపగడపకూ..విమర్శలే.. ఆగ్రహ జ్వాలలే..