ఇవాళ జనసేన నేతృత్వాన చలో నరసాపురం కార్యక్రమం చేపట్టి..అనంతరం మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహిస్తున్నారు.
ఈ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జనసేన మత్స్యకార సమస్యలపై గళం వినిపించడంతో పాటు గత,ప్రస్తుత ప్రభుత్వాల పనితీరును పూర్తిగా తూర్పారపట్టేందుకు, ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు సిద్ధం అవుతోంది.
బెస్తవాడల్లో ఉన్న వాస్తవిక స్థితిగతులు వివరిస్తూనే, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా గంగపాలు అయ్యాయో, ఏ విధంగా నీటి మీద రాతలయ్యాయో చెబుతూ ప్రసంగించేందుకు జనసేనాని పవన్ సంసిద్ధులవుతున్నారు.
ఇప్పటికే కాకినాడ నుంచి నరసాపురం వరకూ జనసేన సారథ్య బాధ్యతలు చూస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బెస్తవాడల్లో తిరుగాడి, క్షేత్ర స్థాయి సమస్యలను నమోదు చేసుకున్నారు.
తాగేందుకు గుక్కెడు రక్షిత మంచి నీరు కూడా దొరకని బెస్తవాడల దయనీయ స్థితిని ప్రపంచానికి చాటేందుకు జనసేన ఎన్నడూ సిద్ధంగానే ఉంటుందని ఈ సందర్భంగా నాదెండ్ల వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే రేపటి పవన్ కార్యాచరణ, ఇవాళ పవన్ ప్రసంగం అన్నవి ఉండనున్నాయి.
2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత గత 7 సంవత్సరాల్లో ఒక్క మత్స్యకారుడి బ్రతుకు బాగుపడలేదు సరికదా, టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల విధానాల వలన వారి బ్రతుకులు ఇంకా దుర్భరంగా మారాయి..అని జనసేన సోషల్ మీడియా విభాగం వాపోతోంది.
ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.దీని ప్రకారం…
TDP Manifesto – 2014 :
* హామీ – 1 : మత్స్యకారుల పిల్లలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు.
– వాస్తవికత : ఒక్క స్కూల్ కూడా ఏర్పాటు చేయలేదు.
* హామీ – 2 : జీవో నంబర్ : 353 పూర్తి స్థాయిలో అమలు. పడవలు,వలలు, చేప పిల్లల కొనుగోలుకు రుణాల మంజూరు.
– వాస్తవికత : అమలు శూన్యం.రుణాల మంజూరులో తీవ్ర జాప్యం. ఇప్పటికీ చాలా మంది తమ పాత పడవలనే వాడుతున్నారు.
* హామీ – 3 : ఇంజిను బోట్ల నిర్వహణకు డీజిల్ పై 50% రాయితీ వర్తింపు.
– వాస్తవికత : 2014-19 మధ్య రాయితీ ఊసేలేదు.
* హామీ – 4 : పంచాయతీరాజ్ , మైనర్ ఇరిగేషన్ వాటర్ ట్యాంకులను
మత్స్యకార సంఘాలకు అప్పగింత.
– వాస్తవికత : అమలు జరగలేదు.
* హామీ – 5 : సముద్రతీర ప్రాంత భూములను మత్స్యకారులకు అర్హత మేరకు కేటాయింపు.
– వాస్తవికత: అమలు జరగలేదు.
* హామీ – 6 : సముద్రంలో మునిగి చనిపోయిన మత్స్యకారుల శవంకనిపించకపోతే,మరణ ధ్రువీకరణ పత్రం జారీకి ఏడేళ్ల సమయాన్ని రెండేళ్లకు తగ్గించి, ఎక్స్గ్రేషియా ఇస్తాం.
– వాస్తవికత : ఇవేవీ అమలు జరగలేదు.
* TDP Manifesto – 2014లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
కొసమెరుపు ఏంటంటే.. 2019 ఎలెక్షన్ల ముందు తమ వెబ్ సైటు నుండి ఆ రోజు వీళ్లిచ్చిన
హామీలన్నింటినీ తొలగించారు..అని చెబుతోంది జనసేన.