ఏపీ టూరిజం శాఖా మంత్రి ఆర్కే రోజారెడ్డి కొద్ది రోజుల క్రితం కోటిన్నర విలువ చేసే బెంజి కారు కొన్న సంగతి తెలిసిందే. అయితే, రోజా అవినీతి సొమ్ము, అక్రమార్జనతోనే అంత ఖరీదైన కారు కొన్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, తన కొడుకు కోరిక తీర్చానని, అతడి కోసమే కారు కొన్నానని రోజా కవరింగ్ ఇస్తున్నారు. అయితే, తన భర్త తీసిన సినిమా వల్ల తాను చాలా డబ్బు నష్టపోయానని కొద్ది రోజుల క్రితం రోజా ఓ షోలో చెప్పారు.
అలా చెప్పిన కొద్ది నెలల తర్వాత బెంజి కారు కొనడంతో రోజా చెప్పిన కబుర్లు ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు నమ్మడం లేదు. ముఖ్యంగా రోజాను జనసేన కార్యకర్తలు ఈ కారు విషయంలో టార్గెట్ చేస్తున్నారు. గతంలో పవన్ కాన్వాయ్ విషయంలో రోజా చేసిన కామెంట్లకు జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో, జనసేన నేతలు, కార్యకర్తలు వర్సెస్ మంత్రి రోజాల మధ్య కార్ వార్ కొంతకాలంగా నడుస్తోంది.
ఈ క్రమంలోనే చిన్న చిన్న యాంకర్లు కూడా కార్లు కొంటున్నారని, జబర్దస్త్ లో ఎంత రెమ్యున్ రేషన్ తీసుకున్నానో చెక్ చేసుకోవాలని అన్నారు. జనసైనికులు పిల్ల వెధవలు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, రోజాకు జనసేన నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. జనసైనికులు పిల్ల వెధవలయితే వైసీపీ నాయకులు పెద్ద వెధవలా అని మండిపడుతున్నారు. అంతేకాదు, రోజా తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. రోజా 150 సినిమాల రెమ్యునరేషన్ పవన్ కల్యాణ్ మొదటి రోజు మొదటి షో కలెక్షన్ తో సమానమని అన్నారు.
జనసేన కాన్వాయ్ లపై గతంలో రోజా విమర్శలు చేశారని గుర్తు చేశారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంపై మంత్రి రోజా, మంత్రి పెద్దిరెడ్డి తమ జనసైనికులను పిల్ల వెధవలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రి రోజా జనసైనికులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రోజా గుట్టురట్టు చేస్తామని హెచ్చరించారు. సినిమాల్లో ఐరన్ లెగ్ అని రోజాను పక్కన పెట్టారన్నారని, జబర్దస్త్ లో కూడా అవకాశాలు లేవని జనసేన నేతలు ఆరోపించారు. జన సైనికులను విమర్శిస్తే చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో రోజాను తిరిగనివ్వమన్నారు.