టాలీవుడ్ కమెడియన్, వైసీపీ మాజీ నేత, జనసేన తాజా నేత పృథ్వీ రాజ్ కొంతకాలంగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీబీసీ చైర్మన్ గా తనను తొలగించారని, కానీ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతిలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సరే వారిని మాత్రం పల్లెత్తు మాట అనలేదని పృథ్వీరాజ్ గతంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు బ్యాగ్రౌండ్ లేదు అన్న కారణంతోనే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
ఇటువంటి ఆరోపణలు వచ్చిన మిగతా వైసిపి నేతలపై మాత్రం ఎటువంటి చర్య తీసుకోకపోవడంపై పృథ్వి గతంలో దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కడపలోని పెద్ద దర్గాను సందర్శించిన పృథ్వీ మరోసారి తన తొలగింపు వ్యవహారంపై స్పందించారు. పార్టీలో ఉన్నంతకాలం చిత్తశుద్ధితో కష్టపడి పని చేశానని, పద్ధతులు నచ్చకే పార్టీ నుంచి బయటకు వచ్చేశానని పృథ్వీ అన్నారు. తన మీద ఆరోపణలు చేసిన వారు దర్గాకు వచ్చి అల్లా సాక్షిగా ప్రమాణం చేయగలరా అని పృథ్వీ సవాల్ విసిరారు.
అలా చేస్తే నీతి నిజాయితీ ఉందో లేదో తెలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకొని పాతికేళ్లు కాపురం చేసిన తర్వాత కూడా మనస్పర్ధలు వస్తే విడిపోతామని, ఇది అంతేనని చెప్పుకొచ్చారు. ఇదే పార్టీలోనే ఉంటామని బాండ్ రాసి రాలేదని, బొట్టు పెట్టి రాలేదని అన్నారు. ఇక, రాష్ట్రంలో పరిస్థితిలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని, ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఏపీలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని షాకింగ్ కామెంట్లు చేశారు. ‘ఏపీ జీరో ఫోర్ రామాపురం’ అనే చిత్రంలో నటిస్తున్నానని, ఆ క్రమంలోనే ఇక్కడికి వచ్చానని పృథ్వీ వెల్లడించారు.