సాధారణంగా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటే ఎంతటి హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎమ్మెల్యే కారుతో పాటు వెనుక ఒక అరడజన్ కార్లు రాయ్ రాయ్ మంటూ వెళ్తుంటాయి. ప్రస్తుత రోజుల్లో కారు లేని ఎమ్మెల్యేలను చూడడం అరుదు. ఎందుకంటే ఎమ్మెల్యేలే కాదు స్థానిక నాయకులు కూడా సొంతంగా కారును మెయింటెన్ చేస్తున్నారు. అలాంటి రోజుల్లో జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి కారు లేకపోవడంతో.. జనసైనికులు విరాళాలు పోగు చేసి మరీ ఆయనకు కారును కానుక ఇచ్చిన ఉద్దాంతం తాజాగా తెరపైకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. సీనియర్ నేత కరాటం రాంబాబు స్ఫూర్తితో బాలరాజు రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్య కార్యకర్తగా ఉన్న ఆయనకు 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. కానీ అప్పుడు ఫ్యాన్ గాలికి బాలరాజు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయినా కూడా నియోజకవర్గంలో ఎల్లప్పుడూ ప్రజలకు అండంగా ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేశారు.
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసే, బీజేపీ పొత్తులో భాగంగా పోలవరం నియోజకవర్గం జనసేనకే వచ్చింది. ఈసారి టికెట్ ఎవరికి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన తరుణంలో పవన్ మళ్లీ బాలరాజుకే అవకాశం కల్పించారు. దాంతో జన సైనికులు, కూటమి నేతలు కష్టపడి బాలరాజును ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సొంత కారును కునేంత స్థోమత బాలరాజుకు లేదు. అందువల్ల నిత్యం ప్రజల్లోకి తిరగడానికి, అభివృద్ధి మరియు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన కారు లేదా ఇతర వాహనాలనే వాడేవారు.
ఈ విషయాన్ని గుర్తించిన జనసైనికులు బాలరాజుపై ఉన్న అభిమానంతో తోచినంత విరాళాలు వేసుకొని దాదాపు రూ. 10 లక్షలు పోగేశారు. ఆ డబ్బుతో డౌన్ పేమెంట్ కట్టి ఫార్చునర్ కారును కొనుగోలు చేసి ఎమ్మెల్యేకు కానుకగా ఇచ్చారు. మిగిలిన సొమ్మును నెలనెలా ఈఎంఐ రూపంలో ఎమ్మెల్యే కట్టుకునేలా ఏర్పాటు చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తమ ఎమ్మెల్యే ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. దీంతో ఎమ్మెల్యే బాలరాజు కోసం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.