తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలతో పాటు బీజేపీ-జనసేన కూటమి కూడా ఈ ఉప ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా తిరుపతి బరిలో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది. మిత్రపక్షం జనసేన మద్దతుతో సెంటిమెంట్ గా తమకు వర్కవుట్ అవుతుందనుకున్న తిరుపతిలో పాగా వేద్దామని ప్లాన్ వేసింది.
ఉపఎన్నిక షెడ్యూల్ కూడా రాకుండానే దాదాపుగా అభ్యర్థిని కూడా ఖరారు చేసే వరకు వెళ్లారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని, అందుకు జనసేన కూడా మద్దతిస్తుందని సోము వీర్రాజు, జీవీఎల్ లు ప్రకటనలు కూడా చేశారు. అయితే, తమను సంప్రదించకుండానే బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జనసేనాని పవన్ కు నచ్చలేదట. తిరుపతిలో జనసేన అభ్యర్ధిని బరిలో దించాలని పవన్ అనుకుంటున్న తరుణంలో బీజేపీ నేతలు తమ అభ్యర్థిని బరిలోకి దించాలనుకోవడం పవన్ కు రుచించలేదట.
ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా పవన్ తీసుకువెళ్లారట. దీంతో, ఈ వ్యవహారంపై బీజేపీ అధిష్టానం తుది నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ పవన్ నేతృత్వంలోని జనసేన అభ్యర్థినే తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలపాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో తిరుపతి స్థానంపై సర్వేలు నిర్వహించిన కేంద్రం పెద్దలు….ఏపీ బీజేపీ నాయకులు చెప్పిన దానికి వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని గ్రహించిందట. ఈ క్రమంలోనే జనసేనకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటన రద్దు అయినట్టు తెలుస్తోంది. దీనికితోడు, టీడీపీకి జనసేన చేరువవుతోందన్న సమాచారంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారట. అదే జరిగితే ఏపీలో బీజేపీ ఒంటరి అవుతుందని, ఓటు బ్యాంకు పోతుందని గ్రహించి తిరుపతి సీటు జనసేనకు కేటాయించబోతుందట. ఒకవేళ అదే జరిగితే తిరుపతిలో జనసేన ఎంతవరకు రాణిస్తుందన్నది వేచిచూడాలి.