జనసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయం పార్టీకి కేడర్ కి మాత్రం ఆనందంగా లేకపోవడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి రెండ్రోజుల క్రితం జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా పవన్ కి కేంద్రం నుంచి కబురొచ్చింది. కిషన్ రెడ్డి, పవన్ తదితరులు కలిసి మాట్లాడిన అనంతరం జనసేన ghmc ఎన్నికల నుంచి తప్పుకుంది.
గురువారం కూడా 27 మందితో కూడిన జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అంతలో ఓట్ల చీలికను అంచనా వేసిన కేంద్ర బీజేపీ హైదరాబాదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పవన్ తో కలిసి నడవాలని ఆదేశించింది. దీంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఇద్దరూ పవన్ ఇంటికి వెళ్లి కలిశారు.
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సంయుక్తంగా ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
నిన్నటి వరకు పార్టీ కార్యకర్తల కోరిక మేరకు పోటీ చేయాలని భావించిన జగన్ ఈరోజు బీజేపీ కోరిక మేరకు విరమించుకుంది. అంటే జనసేనకు తన కేడర్ కంటే కూడా బీజేపీ ప్రయోజనాలు కీలకంగా మారిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి.
చాలా తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తుండటం వల్ల బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదరలేదని రాబోయే ఎన్నికల్లో కలసి పని చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పడం గమనార్హం. ఆ తర్వాత మరోసారి కూడా బండి అదే మాటను పునరుద్ఘాటించారు. సడెన్ గా నేడు నామినేషన్ చివరి రోజును బరిలోంచి జనసేన తప్పుకుని బీజేపీకి జైకొట్టింది.