టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అనారోగ్యం పాలవడం, జైల్లో ఆయనకు సరైన వసతులు లేవని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ విషయాలు ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ప్రజల్లోనూ జోరుగా చర్చకు వచ్చాయి. దీంతో సర్కారు కక్ష సాధింపు చర్యలపై మరోసారి చర్చ సాగింది. దీనిని గమనించిన హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే రంగంలోకి డీఐజీని మీడియా ముందుకు పంపించింది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయనతో ప్రకటనలు చేయించింది.
జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సేఫ్‌గానే ఉన్నారని, ఆయనను అన్ని విధాలా తాము కనిపెట్టుకుని ఉంటున్నామని చెప్పారు. ఒక జైలర్ స్థాయి అధికారితో పాటు ఏడుగురు హెడ్ వార్డర్స్, వార్డర్స్ చంద్రబాబును నిరంతరం గమనిస్తున్నారని తెలిపారు. ఇక, చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్‌లో ఎనిమిది ప్యాన్లు తిరుగుతున్నాయని, వెంటిలేషన్ సమస్యలు కూడా లేవని వివరించారు.
చంద్రబాబు బరువు తగ్గిపోయారని, ఆయన ఆరోగ్యానికి ముప్పు ఉందని కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను పరోక్షంగా తోసిపుచ్చారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కేజీలు ఉన్నారని, ప్రస్తుతం 67 కేజీలు ఉన్నారని డీఐజీ వివరించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని నిరంతరం కనిపెట్టుకుని ముగ్గురు వైద్యులు ఉన్నట్టు చెప్పారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు వాడుతున్న మందులే వాడుతున్నారని వివరించారు.
అవును.. నిజమే!
చంద్రబాబు డీహైడ్రేషన్ కు గురయ్యారన్నది నిజమేనని డీఐజీ రవి కిరణ్ తెలిపారు. వెంటనే ఆయనకు ఓఆర్ఎస్ ఇచ్చినట్టు చెప్పారు. శరీరంపై దద్దర్లు రావడంతో వైద్యులతో పరీక్షలు చేయించామన్నారు. చంద్రబాబు కోసం ఇంటి నుంచి వస్తున్న ఆహారాన్ని అన్ని విధాలా పరీక్షించి.. 50 నిమిషాల తర్వాతే చంద్రబాబుకి అందిస్తున్నామన్నారు.
వాటిపై విచారణే!
డ్రోన్ కెమెరా ఓపెన్ జైలు వరకు వచ్చిందని, దీనిని ఎవరు పంపించారు? అనే విషయంపై విచారణ జరుపుతున్నామని డీఐజీ చెప్పారు. అదేవిధంగా సెంట్రల్ జైలులో చంద్రబాబు ఫోటోలు బయటకు పంపటంపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. బాబు భద్రత విషయంలో వైఫల్యం లేదన్నారు.