ఔను! ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఇదే కామెంట్ వినిపిస్తోంది. ఇదేంది జగనన్నా .. ఇలా జరిగింది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం.. సీఎం జగన్ పాల్గొన్న తాజా సభలో `జై బాలయ్య` నినాదాలు వినిపించడమే.
అసలు ఏం జరిగిందంటే..
జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా వినుకొండకు సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చారు. పట్టణంలో ని వెల్లటూరు రోడులోని బొల్లా బ్రహ్మనాయుడు ఎస్టేట్ వద్ద సభావేదిక ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలోని హెలీప్యాడ్ నుంచి సభావేదిక వద్దకు ఉదయం 11.20గంటలకు జగన్ మోహన్‌రెడ్డి చేరుకొని 12.09 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 12.43 నిమిషాలకు ముగించారు.
సభాప్రాంగణంలో లోపలకు వెళ్లేందుకు గేట్లను ఏర్పాటు చేసి బయటకు రాకుండా పోలీసులు గేట్ల వద్దే ఉన్నారు. జగన్ మాట్లాడుతున్న సమయంలో గేట్ల నుంచి బయటకు రానివ్వకపోవడంతో హెల్త్ క్యాంప్ పక్కన ఉన్న ఇనుప గేట్ల పైనుంచి యువకులు బయటకు దూకగా మిగతా వారు ఇనుప గేటు నెట్టివేసి బయటకు వెళ్లిపోవడం జరిగింది. సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ పక్కన ఉన్న గ్యాలరీలో జనం లేక వెలవెలబోయింది. హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణానికి వచ్చే దారిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే ప్లకార్డులను ప్రదర్శించారు.
బస్టాండ్ సమీపాన ఉన్న మరో ప్రైవేటు పాఠశాల విద్యార్థినీలు కూడా జగన్‌కు స్వాగతం పలకడానికి తరలిస్తుండగా వారు జైబాలయ్య అంటూ నినాదాలు చేయడం వారిలో బాలయ్యపై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది. వినుకొండ సీఎం సభకు వచ్చిన వారికి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా గ్రామాల్లో జనసమీకరణ చేసి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిర్యాని, మందును అందజేసినట్లు సమాచారం. సభావేదిక వద్ద కొందరు మందుబాబులు మందు తాగడం కనిపించింది. జగన్ ప్రసంగం చేస్తుండగా మహిళలు వారికి కేటాయించిన వాహనాల్లో బిర్యాని ప్యాకెట్ల తీసుకొని వెళ్లిపోవడం గమనార్హం.