ఎన్నికల సమయానికి ఏది అందివస్తే.. దానిని తమకు అనుకూలంగా సింపతీ కోసం వినియోగించుకునే రాజకీయాలు చేయడంలో వైసీపీ అధినేత సీఎం జగన్ దిట్ట అని అంటారు. ఇలాంటి సింపతీ రాజకీయాల్లో కీలకమైన సబ్జెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం తాము మాత్రమే పూర్తి చేస్తామంటూ.. గ త ఎన్నికల్లో చెప్పి.. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. మరి ఏం చేశారు? ఇప్పటికి నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును ఎందుకు ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ ప్రశ్నల గుట్టును కేంద్ర ప్రభుత్వం తాజాగా విప్పేసింది. ఎందుకు పనులు కాలేదో.. అసలు జగన్ సర్కా రు పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన సమయం ఎంతో కూడా విప్పి చెప్పేసింది. తాజాగా కేంద్ర జల్‌శక్తి శాఖ వార్షిక నివేదిక విడుదల చేసింది. దీనిలో పోలవరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావించింది. గత ఏడాదిలో పనులు కేవలం కేవలం 0.83 శాతం మేర సాగినట్లు తెలిపింది. గతేడాది నవంబరు నాటికి మొత్తం ప్రాజెక్టు పనులు 78.64 శాతం మేర జరిగాయని పేర్కొంది.
అయితే.. అంతకు ముందు ఏడాది నవంబరు నాటికి పూర్తయిన 77.81శాతం పనులతో పోలిస్తే.. 12నెలల్లో కేవలం 0.83శాతం మాత్రమే పనుల్లో పురోగతి ఉందని నివేదిక వివరించింది. ఇక, పోలవరం పునరావాస కార్యక్రమాల్లోనూ పెద్దగా పురోగతి లేదని నివేదిక పేర్కొంది. తొలిదశలో ముంపునకు గురయ్యే ప్రాంతంలో మొత్తం 75 కాలనీలు నిర్మించాల్సి ఉండగా.. 2021-22 నాటికి 26 పూర్తయ్యాయి. 2022-23 సంవత్సరంలో ప్రకటించిన వార్షిక నివేదికలో కూడా ఆ 26 కాలనీలే పూర్తైనట్లు వెల్లడైంది. అంటే సంవత్సరంలో ఒక్క కాలనీ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది.
ఎంత ఖర్చవుతుందో.. ఏమో!
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని కేంద్ర నివేదిక వెల్లడించడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 11న జరిగిన 141వ సలహా కమిటీ సమావేశంలో.. 55 వేల 548 కోట్ల 87 లక్షల రూపాయలకు సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జల్‌శక్తిశాఖ ఆమోదించింది. కానీ, కేంద్రం.. 2020 మార్చి 17న జల్‌శక్తి శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది.. సమర్పించిన నివేదికలో.. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని 47వేల 725 కోట్ల 74లక్షల రూపాయలకు సిఫార్సు చేసింది. దీన్ని ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు.
పెరుగుతున్న వరదతో..
తొలిదశలో పోలవరం వరద ప్రభావిత మండలాల సంఖ్య ఇది వరకు 5 ఉండగా.. 2022-23 నాటికి ఆరుకు పెరిగింది. అంతేకాకుండా ప్రభావిత ఆవాస ప్రాంతాల సంఖ్య 115 ఉండగా అది 123కి చేరుకుంది. కొత్తగా ఒక్క పునరావాస కాలనీ నిర్మించకపోగా అంతకముందే నిర్మించిన పునరావాస కాలనీలోకి కొత్తగా 13 ఆవాస ప్రాంతాలను తరలించగా.. ఆవాస ప్రాంతాల సంఖ్య 25నుంచి 38కి పెరిగింది. అంటే మొత్తంగా.. పోలవరం మరింత గుదిబండగా మారిందనే సంకేతాలు వస్తున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం సింపతీ ఓట్లు పిండుకునే ఛాన్స్ కూడా.. జగన్‌కు లేదని అంటున్నారు పరిశీలకులు.