జగన్ అంటే అంతే! అంటూ.. వైసీపీ నాయకులు, మంత్రులు తరచుగా ప్రచారం చేస్తుంటారు. మడమ తిప్పడు-మాట తప్పడు అంటూ మంత్రి రోజా వంటి వారు ఇప్పటికీ ఏ సభలో పాల్గొన్నా చెబుతుంటారు. అయితే, తాజాగా దసరా పండగ ముందు.. సర్కారీ నౌకర్లకు(ఉద్యోగులు) జగన్ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. తాను పంతం పట్టి తీసుకువచ్చిన గ్యారెంటీ పింఛను పథకానికే జగన్ మొగ్గు చూపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ పై బిల్లు తెచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా దానిని గవర్నర్‌తో ఆమోదించుకుంది.
అయితే.. దీనిపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్.. ఉద్యోగులు 2004 నుంచి డిమాండ్ చేస్తున్న సీపీఎస్(కంట్రి బ్యూటరీ పింఛను స్కీమ్)ను రద్దు చేస్తామని.. దీని స్థానంలో బ్రిటీష్ హయాం నుంచి ఉన్న ఓపీఎస్(ఓల్డ్ పింఛను స్కీమ్-ఇది రైల్వే, అఖిల భారత సర్వీసులకు అమల్లో ఉంది) తీసుకువస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
అది కూడా తాను అధికారంలోకి వచ్చిన వారంలోనే చేస్తానని చెప్పారు. దీనిని నమ్మిన లక్షల మంది ఉద్యోగులు జగన్ వెంటే నడిచారు. టీడీపీకి కంచుకోటల వంటి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీకి వీరతిలకం దిద్ది.. వీరతాళ్లు వేశారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. జగన్ ఈ విషయాన్ని అటకెక్కించారు. అంతేకాదు.. ఉద్యోగులు పదే పదే వద్దని చెబుతున్న జీపీఎస్‌ను తీసుకువచ్చారు. పంతానికి పోయి.. తాజాగా దానిని అమల్లోకి తీసుకువచ్చేశారు. అది కూడా దసరా ముందు నాలుగు రోజుల సెలవులు చూసుకుని మరీ గెజిట్ జారీ చేసేశారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
జగన్ పంతం నెరవేరింది. తాను తీసుకురావాలని అనుకున్న జీపీఎస్‌ను తీసుకువచ్చేశారు. అయితే.. ఇది వైసీపీకి వచ్చే ఎన్నికల్లో శరాఘాతంగా మారుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరి ఇంట్లో కనీసం రెండు చొప్పున ఓట్లు లెక్కించుకున్నా.. 9 లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి.
వీరు పంతం పట్టి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమనే చర్చ సాగుతోంది. ఉద్యోగ సంఘాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఇదే జరిగితే.. దాదాపు 10 లక్షల ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంటుందని ఒక అంచనా. మరి జగన్‌కు ఇది మేలు చేస్తుందా? అంటే.. లేదనే అంటున్నారు వైసీపీ నాయకులు. మొత్తానికి తన పంతంతో తన గొయ్యి తానే తవ్వుకున్నట్టు అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.