ఏపీ సీఎం జగన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లకు సాయం చేసి తప్పు చేశానంటూ ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అటువంటి వారి లక్ష్యాలను నెరవేర్చేందుకు సాయపడటానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి కృషి చేసి ఉంటే బాగుండేదని పీకే పశ్చాత్తాపపడిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశంలో అసలు సిసలైన మహాత్మా గాంధీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమని తనకు ఆలస్యంగా అర్థమైందని పీకే చెప్పడం సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే పీకే వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి స్పందించారు. గాంధీ కాంగ్రెస్ తోనే గాడ్సే బిజెపిని ఓడించగలమని పీకే చెప్పడం ఆహ్వానించదగ్గ పరిమాణం అని తులసి రెడ్డి అన్నారు. గడిచిన ఎన్నికల్లో జగన్ పదవి కాంక్షకు సహకరించడం తప్పని పీకే ఇప్పటికైనా గుర్తించడం సంతోషకరమని అన్నారు.
పీకే తాజా వ్యాఖ్యలతో అయినా ఏపీ ప్రజలంతా జగన్ నిజస్వరూపాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను జనం గుర్తించాలని చెప్పారు. ఇక, రైతుల వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల కొనుగోళ్లలో జగన్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరతీసిందని తులసి రెడ్డి ఆరోపించారు. ఒక్కో స్మార్ట్ మీటర్ కొనేందుకు, నిర్వహణ కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.12,500 ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
అయితే, అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఒక్కో మీటర్ పై దాదాపు 35 వేల రూపాయలు ఖర్చు చేయాలనుకోవడం దోపిడీ అన్న సంగతి ప్రజలు గుర్తించాలని అన్నారు. ఇక, జగన్ పాలనలో ప్రజలకు కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయిందని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు.