ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 వారాలు మాత్రమే కావొస్తోంది. పాతకక్షల నేపథ్యంలో వినుకొండలో జరిగిన హత్యపై వైసీపీ అధినేత జగన్మోహన్ చేస్తున్న సంచలన ఆరోపణల గురించి తెలిసిందే. ఈ హత్యతో పాటు.. పుంగనూరులో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ కొత్త నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేస్తానని చెప్తున్న జగన్.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
ఐదు వారాల్లో ఎన్ని హింసాత్మక ఘటనలు జరిగాయంటూ కొత్త వంటకాన్ని వండేసి.. జనం మీదకు వదలుతున్న వేళ.. ఐదేళ్ల క్రితం అధికారంలోకి రావడానికి ముందు.. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన వివేకా హత్య విషయంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారమే జరిగింది. గ్యాంగ్ వార్ లో హత్యకు గురైన రషీద్ ఉదంతానికి స్పందించి.. రోడ్ల మీదకు వచ్చిన జగన్.. సొంత బాబాయ్ వివేకా దారుణ హత్య కేసును ఐదేళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేదు? అన్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు.
చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన ఐదు వారాలకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన ఐదేళ్ల పాలనను మర్చిపోయారా? ఆ ఐదేళ్లలో ఏం జరిగింది? ఎంతటి అరాచకానికి ఏపీ కేరాఫ్ అడ్రస్ అయ్యిందన్నది మర్చిపోయినట్లున్నారు. కోడి కత్తి ఉదంతంలోనూ.. వివేకా హత్య జరిగినప్పుడు మొత్తం చంద్రబాబే చేశారంటూ జగన్ అండ్ కో ప్రచారం చేయటం తెలిసిందే. నిజంగానే బాబు ప్రభుత్వంలో జరిగిన ఈ ఘటనల మూలాలు ఎక్కడ ఉన్నాయి? దానికి కారణమైనోళ్లకు జగన్ ఐదేళ్ల ప్రభుత్వంలో శిక్ష ఎందుకు పడలేదన్న ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇవ్వరు?
తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆ చివర ఉమ్మడి శ్రీకాకుళం మొదలు ఈ చివరి అనంతపురం జిల్లా వరకు.. నిత్యం ఏదో ఒక దౌర్జన్యం.. మరో కక్ష సాధింపులతో నింపేసిన వైనాన్ని మరచిపోయినట్లున్నారు. ఐదేళ్లలో జరిగిన అరాచక ఘటనల్ని ప్రస్తావిస్తే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. దారుణాలకే దారుణాలైన కొన్ని ఉదంతాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అప్పుడే.. ఐదేళ్ల తన పాలన గురించి జగన్ కాస్తంత తెలుసుకోవాల్సిన అవసరముంది. ఐదు వారాలకే రాష్ట్రపతి పాలన అంటూ హడావుడి చేస్తున్నప్పుడు.. ఐదేళ్ల జగన్ పాలనలో మరెన్ని సార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాల్సిందన్న సందేహం కలుగక మానదు.
– నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం
– కడప జిల్లా పొద్దుటూరులో చేనేత సుబ్బయ్య హత్య
– చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలు
– నెల్లూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణి కోసం చోరీ
– నెల్లూరు జిల్లాలో బీజేపీ మహిళా నేతపై కత్తులతో దాడి
– ప్రకాశం జిల్లాలో మైనింగ్ దోపిడీ
– ప్రకాశంలో బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్య
– ‘జై జగన్’ అనలేదన్న ఒకే ఒక్క కారణంగా పల్నాడులో పట్టపగలు అందరూ చూస్తుండగా చంద్రయ్య గొంతు కోసేసి హత్య చేసిన వైనం
– గుంటూరులో రంగనాయకమ్మకు సీఐడీ వేధింపులు
– రాజధాని మహిళా రైతులపై దాడులు
– డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ హెడ్డాఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయటం
– ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్
– విజయవాడ టీడీపీ కార్పొరేటర్ గాంధీ కన్ను పొడిచేయటం
– పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడటం
– గన్నవరం (క్రిష్ణా జిల్లా) టీడీపీ ఆఫీసుపై దాడి
– ఉభయ గోదావరి జిల్లాల్లో దళితుడికి పోలీస్ స్టేషన్ లోశిరోముండనం
– డ్రైవర్ ను చంపేసి.. శవాన్ని ఇంటికి పార్సిల్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే అరాచకం
– కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దందాలు
– దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని మాజీ సైనికుడిపై పోలీసుల దాడి
– విశాఖపట్నంలో దళిత వైద్యుడు సుధాకర్ ను నడిరోడ్డులో రెక్కలు విరిచి పోలీసులతోకొట్టించటం
– విజయసాయి రెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి సెటిల్ మెంట్లు
– విజయనగరంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం
– రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉదంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు పెట్టటం
– ఉమ్మడి శ్రీకాకుళానికి చెందిన అచ్చెన్నాయుడు మొదలుకొని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు ప్రతి శుక్ర.. శనివారాల్లో (దాదాపుగా) ఎవరో ఒక టీడీపీ నేతను అరెస్టు చేయటం.. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసి జైలుపాలు చేయటం
– మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై చోరీ ఆరోపణలు చేసి వేధింపులకు గురి చేయటంతో.. ఏకంగా ఆత్మహత్య చేసుకునేలా చేయటం
– తమ కుటుంబం నిర్మించిన గుడిలోకి క్లీన్ చిట్ ఉన్న అశోక్ గజపతిరాజు కుటుంబీకులను రానివ్వని దుర్మార్గం
– పులివెందులలో దళిత మహిళకు జరిగిన అన్యాయంపై గళం విప్పిన వంగలపూడి అనితపై అగ్రాసిటీ కేసు నమోదు
– 50 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టించటం.. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకోవటం.
– విశాఖకు రానివ్వకుండా పవన్ ను అడ్డుకోవటం
– సొంత పార్టీ ఎంపీ రెబల్ గా మారి విమర్శలు చేస్తున్నరన్న కారణంతో హైదరాబాద్ లో అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్ లో చితకబాదటం.. తీవ్ర హింసకు గురి చేయటం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు. వీటన్నింటికి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాల్సి ఉంటుందంటారు?