అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా దక్కాల్సిందేనని వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ సభ్యులు మారాం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 40 శాతం ఓటింగ్ ఉన్న తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ రకంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ నేపథ్యంలోనే తాజాగా పవన్ కు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇక, పవన్ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారంటూ జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో, జగన్ పై జనసేన నేతలతో పాటు పవన్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో 21కి 21 స్థానాలు గెలుచుకున్న పవన్ ను కామెంట్ చేసే స్థాయి జగన్ కు లేదని ట్రోల్ చేస్తున్నారు. మాజీ సీఎంగా పనిచేసిన జగన్ ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు.