తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుది. అందుకే గురువును మన దేశంలో దైవంగా విద్యార్థులు భావిస్తుంటారు. కానీ, ఏపీలో మాత్రం ఈ ఫార్ములా వర్తించదు అని సీఎం జగన్ వచ్చాకే జనానికి తెలిసింది. ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని సైతం అవమానకరమైన రీతిలో విధులు నిర్వహించేలా చేసిన ఘనత జగన్ కే దక్కింది. పాకీ దొడ్ల దగ్గర కాపలాకు పెట్టినా…వైన్ షాపుల దగ్గర పర్యవేక్షణకు పెట్టినా…ఉపాధ్యాయుల ను ఈ స్థాయిలో అవమానించిన ముఖ్యమంత్రి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.
ఇటువంటి ముఖ్యమంత్రిపై నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఉపాధ్యాయులకు లేకుండా ఉక్కు పాదం మోపారు జగన్. ఇక, ఉపాధ్యాయులను ఇంత టార్చర్ పెట్టడంతో ఎన్నికల విధుల సందర్భంగా వారు ఇబ్బంది పెడతారేమో అని అంతా అనుకున్నారు. అయితే వారికి అవకాశం ఇవ్వకుండా ఎన్నికల విధుల నుంచి ఏకంగా వారిని తప్పించేందుకు కూడా జగన్ సిద్ధపడ్డారు. ఇంతకన్నా, ఉపాధ్యాయులను ఏ రకంగా జగన్ టార్చర్ పెట్టలేరు అనుకున్న ప్రతి సారీ జగన్ సరికొత్త పద్ధతులలో వారిపై కక్ష సాధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఫేస్ రికగ్నైజేషన్ తో ఉపాధ్యాయుల హాజరు పెట్టిన జగన్ ఇప్పుడు తాజాగా మరో హింసించే రాజు పులకేసి టైపు నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఇకపై, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఫోన్ వాడటంపై నిషేధం విధిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. తరగతి గదిలోకి వెళ్లే ముందు ఉపాధ్యాయులు తమ ఫోన్లను ప్రధానోపాధ్యాయుడు దగ్గర పెట్టి వెళ్లాలని ఆ ఉత్తర్వులలో విద్యా శాఖ పేర్కొంది. ఇకపై, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశించింది.
అయితే, ఈ నిర్ణయం తమ ఏకపక్షంగా తీసుకున్నది కాదని, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యాబోధనకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఈ నిబంధనలను పాటించకపోతే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలాగా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు చూడాలని ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే ఆంక్షల వలయంలో చిక్కుకున్న ఉపాధ్యాయులు జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.