నేను గద్దెనెక్కిన వారం రోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేసేస్తా.. మళ్లీ పాత పింఛను పథకాన్ని అమల్లోకి తెస్తానని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ గంభీరంగా ప్రకటించారు. ఆయన మాటలు నమ్మిన ప్రభుత్వోద్యోగులు రెండు చేతులతో ఓట్లేసి గెలిపించారు. కానీ సీపీఎస్‌ను రద్దుచేయలేదు సరికదా.. వారికి ఆయన గట్టి షాకే ఇచ్చారు. వారికి గ్యారెంటీ లేని పెన్షన్‌ను అమల్లోకి తెచ్చారు. అంతేకాదు.. 33 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటే కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధన అమల్లోకి తెచ్చారు.
ఉద్యోగ సంఘాల నేతలను మచ్చిక చేసుకోవడానికి ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన ఆయన.. బలవంతపు రిటైర్మెంట్ నిబంధన పెట్టడం విస్తుగొల్పుతోంది. పదవీ విరమణ వయసు రాకున్నా సరే… మీ సేవలు ఇక పనికిరావని ఆయన తేల్చేయడం.. ఏకంగా జీపీఎస్ బిల్లులోనే ఈ నిబంధన పెట్టడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధనలతోపాటు రివైజ్డ్ స్టేట్ పెన్షన్ రూల్స్-1980లోని 44వ నిబంధన ప్రకారం… ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు. ఇది దశాబ్దాలుగా, కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధన. కేంద్రం గానీ, రాష్ట్రం గానీ దీనిని అమలు చేయలేదు.
అయితే.. ఆరేళ్ల కిందట మోదీ సర్కారు దీనిని మరోసారి తెరపైకి తెస్తోందని అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో… 2017లో రాష్ట్ర జీఏడీ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి నాగులాపల్లి శ్రీకాంత దీనిపై తన సిబ్బందిని ఆరా తీశారు. ‘33 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగులను రిటైర్ చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కేంద్రం, రాష్ట్రంలో పెన్షన్ రూల్స్ ఎలా ఉన్నాయో నోట్ పంపండి’ అని అడిగారు. అంతే! అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ పత్రిక నానా యాగీ చేసింది. ‘చంద్రబాబు ఉద్యోగులకు పొగబెడుతున్నారు. 50 ఏళ్లకే ఇంటికి పంపేందుకు కుట్ర పన్నారు’ అంటూ తప్పుడు కథనాలు రాసింది.
అలాంటి ప్రతిపాదనలేవీ లేవని నాడు ప్రభుత్వం స్పష్టం చేసినా ఉద్యోగులను రెచ్చగొట్టింది. ఈ ఎపిసోడ్‌ను జగన్ రాజకీయంగా వాడుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా లేని వివాదం సృష్టించిన ‘రూల్ 44’పై ఆయన ఇప్పుడు ఏకంగా బిల్లు ఆమోదింపజేసుకున్నారు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలు అడగలేదు. కనీసం వారికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ పెన్షన్ రూల్ 44 ప్రకారం 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే చాలు ‘ప్రజా ప్రయోజనాల’ పేరుతో ఇంటికి పంపించవచ్చు.
బలవంతపు రుద్దుడు…
సీపీఎస్ ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో నుంచి 10 శాతాన్ని పెన్షన్‌కు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా 10 శాతం జమ చేయాలి. ఈ మొత్తాన్ని ఎన్‌ఎస్‌డీఎల్‌లో జమ చేసి, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. వాటిపై వచ్చిన రాబడులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతూ ఉంటాయి. ఇలా సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ జమ అవుతుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరికి ముందు 16 నెలల పాటు ప్రభుత్వం.. ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను ఎన్ఎస్డీఎల్కి జమ చేయలేదు. ఆ తర్వాత 8 నెలల కంట్రిబ్యూషన్‌ను మాత్రం జమ చేసింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగుల వాటా వసూలు చేస్తున్నారు కానీ, ఎన్ఎస్డీఎల్కు జమ చేయడం లేదు. ఇలా ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగుల పెన్షన్ ఫండ్ పెరగదు. వారికి నష్టం జరుగుతుంది.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌లో తన కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచింది. ఉద్యోగులు 10 శాతం వద్దే కొనసాగొచ్చు లేదా 14 శాతానికి పెంచుకోవచ్చనే ఆప్షన్‌ను ఇచ్చింది. కానీ, జగన్ సర్కార్ మాత్రం 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 10 శాతం కంట్రిబ్యూషనే ఇస్తోంది. అది కూడా సకాలంలో ఎన్ఎస్డీఎల్కు జమ చేయడం లేదు. నిబంధనల ప్రకారమైతే జగన్ ప్రభుత్వం కూడా 2019-20 నుంచి కంట్రిబ్యూషన్‌ను 14 శాతానికి పెంచాలి. అంటే సీపీఎస్ ఉద్యోగులు 53 నెలలుగా 4 శాతం మేర కంట్రిబ్యూషన్, దాన్ని ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రాబడులు నష్టపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో పెన్షన్ కూడా తగ్గుతుంది.
పెన్షన్‌కు గ్యారెంటీ లేదు.
జగన్ తెచ్చింది పేరుకు మాత్రమే ‘గ్యారెంటీ’ పెన్షన్ స్కీం. కానీ ఇందులో పెన్షన్‌కు గ్యారెంటీ లేదు. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను తమ గుప్పిట్లో ఉంచుకోవడంసహా అనేక మెలికలు పెట్టారు. అనేక నిబంధనలతో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. ఓపీఎస్ విధానంలో ఉద్యోగులకు మూలవేతనంలో 50 శాతం పెన్షన వస్తోందని… సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు కూడా మూలవేతనంలో 50 శాతం మొత్తాన్ని పెన్షనగా అందించేందుకే జీపీఎస్ తీసుకొచ్చామని ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టారు. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ 50 శాతంకంటే తగ్గితే… మిగిలిన మొత్తాన్ని ‘టాప్అప్’ రూపంలో చెల్లించడమే ఇందులో కీలకం.
అలా చేస్తేనే ఇది ‘గ్యారెంటీ’ పెన్షన్ స్కీమ్ అవుతుంది. కానీ… ఈ టాప్అప్కే ఎసరు పెట్టేలా బిల్లులో నిబంధనలు పెట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా… టాప్అప్ను ఏ క్షణమైనా రద్దు చేసే అధికారం తమకు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. టాప్‌అప్‌లో కొంత భాగం గానీ, పూర్తిగా గానీ నిలిపివేయవచ్చునని బిల్లులో పేర్కొంది. అదే కనుక జరిగితే సీపీఎస్‌కు, జీపీఎస్‌కు తేడా ఉండదు. జీపీఎస్ అమలు వల్ల 2040 నాటికి రూ.2500 కోట్ల భారం పడుతుందని బిల్లులో పేర్కొన్నారు. అయితే… పదవీ విరమణ సమయానికి జమ అయిన కాంట్రిబ్యూషన్లో 60 శాతం ప్రభుత్వమే ఉంచుకుంటోంది. అలాంటప్పుడు అంత భారం పడే అవకాశమే లేదని ఉద్యోగులు చెబుతున్నారు.
అప్పుల కోసమే తిప్పలు…
సీపీఎస్‌లో ఉండే ప్రధాన అంశాలన్నీ జీపీఎస్‌లోనూ ఉన్నాయి. అదనంగా పేర్కొన్న ‘టాప్అప్’పై అనేక షరతులు విధించారు. సీపీఎస్‌ను కేంద్ర ప్రభుత్వం సంస్కరణగా భావిస్తోంది. సీపీఎస్ అమలుకు చట్టం చేస్తే అదనపు రుణాలకు అనుమతి ఇస్తోంది. ఈ రకంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం మరో రూ.4,500 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునేందుకే అసెంబ్లీలో జీపీఎస్ బిల్లు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.