ఎక్కడ నెగ్గాలో కాదు…ఎక్కడ తగ్గాలో ఆయనకు తెలుసు…ఇది ఓ తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన పంచ్ డైలాగ్. అయితే, తాజాగా ఏపీ సెీఎం జగన్ ప్రవర్తన చూసిన వారంతా కొత్త పంచ్ డైలాగ్ తో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ నవ్వాలో…ఎక్కడ ఏడ్వాలో కూడా జగన్ కు తెలీదు అని విపక్ష నేతలు మొదలు నెటిజన్ల వరకు అందరూ జగన్ ను ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు.
చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలను ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కకావికలం చేసిన సంగతి తెలిసిందే. వరద బాధితులను హెలికాప్టర్ లో నుంచి చూసి జగన్ వెళ్లిపోయారని, మొక్కుబడిగా ఏరియల్ సర్వేచేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో, జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి…రాజు వెడలె రవితేజములలరగా అంటూ పరామర్శకూ హెలికాప్టర్ లోనే బయల్దేరారు.
బాబు బాగా రిచ్ కదా హెలికాప్టర్ లో వెళ్లారని సర్ధకుందామనుకుంటే…పరామర్శకు వెళుతున్నామన్న సోయ కూడా లేకుండా ఎంచక్కా హెలికాప్టర్ లోనే ముసిముసినవ్వులలోనా…అంటూ సెల్ఫీలు దిగారు. ఆల్రెడీ పరామర్శించడానికి రాలేదన్న ట్రోలింగ్ ఎదుర్కొంటున్న జగన్…ఇలా టూర్ కు వెళుతున్నట్లు సెల్ఫీలు దిగడంతో ఇటు విపక్ష నేతలకు…అటు వరదబాధితులకు మండిపోయింది. ఎవరన్నా సెల్ఫీ దిగుదామంటే వద్దని వారించాల్సిన జగనే స్పాట్ బాగుంది కదా అంటూ స్వయంగా సెల్ఫీ తీసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.
ఆల్రెడీ ఈ సెల్ఫీపై స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ…జగన్ ను ఏకిపారేశారు. ఇక, జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఫైర్ అయ్యారు. వరదల్లో చిక్కుకొని జలసమాధి అయిన 60 మంది కుటుంబసభ్యుల్ని పరామర్శించడానికి వెళుతున్నారన్న బాధ జగన్ లో ఏ మాత్రం లేదని, వంధిమాగధులతో సెల్ఫీలు తీసుకోవడానికి జగన్ వెళ్లలేదని లోకేష్ మండిపడ్డారు.
ఇక, ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జనం మీదపడి ముద్దులు కురిపించిన జగన్…ఇపుడు వరదలో సర్వం కోల్పోయిన అదే జనాన్ని మాత్రం అంటరాని వారిలాగా దూరంగా నిలబడి పరామర్శించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. రోప్ పార్టీలకు ఇవతల ఉన్న జగన్… జనానికి దూరంగా నిలుచొని మాట్లాడుతూ కూడా నవ్వు ముఖం పెట్టడంపై ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో, జనం బాధలు అంత పైశాచిక ఆనందం కలిగిస్తున్నాయా జగన్.. అంటూ లోకేష్ మండిపడ్డారు.