అధికారంలో ఉన్న పార్టీ ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని కానీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు మాత్రం తెలుగు దేశం పార్టీని ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ‘బుచ్చి రామ్‌ప్రసాద్’ మండిపడ్డారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినంత మాత్రాన అధికార వైసీపీకి భయపడేది లేదని వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్‌కు తగిన గుణపాఠం చెప్తారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని అధికార పార్టీని హెచ్చరించారు.
ఇటీవల టీడీపీ నేత పట్టాభి రామ్.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారంటూ ఆగ్రహంతో రగిలిపోయిన వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందుకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా 36 గంటల దీక్ష కూడా చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని అధికార ప్రభుత్వ నియంతృత్వ పాలనపై ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో కీలక నేత అయిన’ బుచ్చి రామ్‌ప్రసాద్’ స్పందించారు.
రాష్ట్రంలో ఎప్పటికీ జగనే అధికారంలో ఉండబోరని.. వచ్చే ఎన్నికల్లోనే ఆయన గద్దె దిగడం ఖాయమని రామ్‌ప్రసాద్ జోస్యం చెప్పారు. 2023లో టీడీపీ తిరిగి అధికారం దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని.. ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని జగన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని విషయాలనూ ప్రజలు గమనిస్తున్నారనే వచ్చే ఎన్నికల్లో వాళ్లే సరైన తీర్పు ఇస్తారని ఈ ఎన్ఆర్ఐ నేత పేర్కొన్నారు. గతంలోనూ దేవాలయాలపై దాడులు టీటీడీ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ‘బుచ్చి రామ్‌ప్రసాద్’ గొంతెత్తిన విషయం విదితమే. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై మరోసారి ఆయన తనదైన శైలిలో ఇలా స్పందించారు. అధికార వైసీపీ పార్టీపై సీఎం జగన్‌తో సహా ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేశారు.