బడులను విలీనం చేయాలని ఆలోచనకు, నూతన విద్యా విధానం అమలుకు అస్సలు సంబంధమే లేదని యువ ఎంపీ రాము అంటున్నారు. పార్లమెంట్ వేదికగా ఇదే మాట అంటున్నారు. కానీ ఆ మాట వినిపించుకునే స్థితిలో బొత్స కానీ జగన్ కానీ లేరు. ఒకటి, రెండు తరగతులను వదిలి మూడు, నాలుగు, ఐదు తరగతుల పిల్లలను హై స్కూల్లో చేర్చాలని చేసిన ప్రయత్నంలో భాగంగా చాలా ప్రాథమిక పాఠశాలలు అగమ్యగోచరంగా ఉన్నాయి.
ఏం చేయాలో తోచని పసిబిడ్డలు అల్లంత దూరాన ఉన్న బడికి వెళ్లమనే అంటున్నారు. కొందమంది చిన్నారులు తమకు పాత బడే ఇష్టమని, అక్కడే ఉండి చదువుకుంటామని అంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా, మైలవరం పొందుగల రోడ్డులో నాలుగో నంబర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులంతా నిన్నటి వేళ విలీనాన్ని వ్యతిరేకిస్తూ తమను సమీప హైస్కూలు లో చేర్చినా కూడా అవేవీ వద్దని పాత బడికి వచ్చేశారు.
70 మంది పిల్లలు బడికి రావడంతో తరగతులు కిక్కిరిశాయి. చిన్నారుల నవ్వుల కిలకిలలు మళ్లీ వినిపించాయి. ఇదే సమయంలో జగనన్న ఎమ్మెల్యేలకూ కొన్ని భయాలు పట్టుకున్నాయి. ఇప్పుడు కనుక విలీనాన్ని వ్యతిరేకించకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న బెంగ కూడా వారిలో ఉంది. అందుకే వీలున్నంత వరకూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తో మాట్లాడేందుకు, ఆయనకు నచ్చజెప్పేందుకు ఇష్టపడుతున్నారు. ప్రాధాన్యం ఇస్తున్నారు.
మరోవైపు విలీనం కారణంగా కేవలం ఒకేఒక్క విద్యార్థితో మిగిలిన బడులూ ఉన్నాయి. ఆ బడులు ఇప్పుడిక ఏకోపాధ్యాయ (సింగిల్ టీచర్) పాఠశాలలుగా మిగిలిపోతున్నాయి.ఉమ్మడి విశాఖ జిల్లా, సబ్బవరం మండలంలోని గొల్లలపాలెం ప్రాథమిక పాఠశాలలో 29 విద్యార్థులుండేవారు. విలీనం కారణంగా చాలా మంది పిల్లలు ప్రయివేటు బడులకు వెళ్లిపోయారు. కొందరు మాత్రమే సమీప జెడ్పీస్కూల్ లో చేరారు. ఆ విధంగా ఇక్కడఇప్పుడు ఒకే ఒక్క విద్యార్థి, అదేవిధంగా ఒకే ఒక్క టీచర్ మిగిలిపోయారు.
ఇదే విధంగా చాలా చోట్ల బడుల మూతతో సమీప ప్రయివేటు పాఠశాలలకు, చిన్న చిన్న కాన్వెంట్లకు మహర్దశ పట్టింది. కానీ ఎక్కువగా గ్రామీణ విద్యార్థులే నష్టపోయారు. తమ పిల్లలను దూరంగా ఉన్న హైస్కూలుకు పంపలేక కొంతమంది తల్లిదండ్రులు ఆర్ధికంగా భారం అయినా సరే ప్రయివేటు బడులకే పంపించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే సమయంలో మౌలిక వసతుల కొరత కూడా వేధిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
నాడు నేడు లో భాగంగా కొన్ని బడులకే మంచి రూపు దక్కింది కానీ ఇంకా రెండో దశ పనులు ప్రారంభం కాలేదు. దీంతో చాలా బడులు అస్సలు అంతమంది పిల్లలతో నడిపేందుకు ఏ మాత్రం సౌకర్యవంతంగా లేవు. విలీనం కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యార్థులు చెట్ల కిందే పాఠాలు వింటున్నారు. తరగతులు చాలక ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ఇక్కడి పీసీపల్లి మండలం, పెదజర్లపాడు పాఠశాలలో ఈ దుః స్థితి నెలకొంది.
అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, దుద్దుకూరు ఉన్నత పాఠశాలలో సైతం విలీనం కారణంగా అనేక అవస్థలు నెలకొని ఉన్నాయి. ఏడు వందల మంది విద్యార్థులు నానా అవస్థలు పడుతూ ఇక్కడ చదువులకు వస్తున్నారు. పిల్లలు కూర్చొనేందుకు బల్లలు లేక నేలపై కూర్చొనే చదువులు సాగిస్తున్నారు. కేవలం ఈ రెండు జిల్లాల్లోనే కాదు చాలా చోట్ల ఇదేవిధంగా పాఠశాలల విలీనం అన్నది పెను సమస్యలకు తావిస్తోంది.
Comments 1