జగన్ ఫొటోతో ఉన్న పోస్టర్ను నోటితో లాగి పడేసిన.. కుక్కపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న `మా నమ్మకం నువ్వే జగన్` పోస్టర్ను ప్రతి ఇంటికీ పార్టీ ఎమ్మెల్యేలు.. మం త్రులు అతికిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 14 రోజులు సాగే ఈ కార్యక్రమం వెనుక ప్రభుత్వం పై ప్రజ లు ఏమనుకుంటున్నారనే కీలక సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. అయితే… ఈ పోస్టర్లపై అనేక విమర్శలు వచ్చాయి.
అయినా.. కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ పోస్టర్ల కార్యక్రమాన్ని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లారు. అయితే, అనూహ్యంగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఇంటి గోడపై ఉన్న పోస్టర్ను ఓ కుక్క చింపేసింది. దానిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో వైసీపీ నేతల అహం దెబ్బతిన్నట్టుంది. విజయవాడకు చెందిన పార్టీ మహిళా నాయకురాళ్ళు నేరుగా నున్న పోలీస్ స్టేషన్కు వెళ్లి కుక్కతో పాటు దాని యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు.
పోలీసు సీఐ కూడా కేసు నమోదు చేసుకున్నారు. దీని వెనుక కుట్ర కోణం దాగుందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదుతో పాటు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోను కుక్క తొలగిస్తున్న వీడియోను సైతం జత పరిచారు. ఇక ఈ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ను అవమాన పరిచేందుకు కొన్ని శక్తులు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ కుక్క ఘటన వెనుక ఉన్న వారు ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదని ఆమె చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని.. అందుకే దానిని ఓర్చుకోలేక కొందరు ఇలా ఉద్దేశ పూర్వకంగా కుక్కలను ఉసిగొలిపి.. చేస్తున్నారని.. మండిపడ్డారు. మరి వీరి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దీనిని శ్రీకాకుళానికి బదిలీ చేయనున్నట్టు సమాచారం.