అల వైకుంఠపురం సినిమాలో పూజా హెగ్డే కాళ్లను పట్టుకొని అల్లు అర్జున్ చూపులు వదలనట్లుగా…ఏపీ సీఎం జగన్ ఫొటోలు ఏపీలోని ప్రభుత్వ పథకాలను వదలవు. ఈ కాళ్ల ఫ్యాంటసీ ఏంటయ్యా అని బన్నీని పూజా హెగ్డే అడిగిన రీతిలో…జగన్ కు ఈ వైసీపీ రంగుల ఫ్యాంటసీ ఏమిటని కోర్టులు మొదలు సామాన్యుల వరకు అందరూ విమర్శలు గుప్పించారు. అయినా సరే, ఆ సినిమాలో పూజా హెగ్డే కాళ్లను బన్నీ వదలకుండా సినిమా అయిపోయే వరకు ఆమె చుట్టూనే తిరుగుతున్న రీతిలో…జగన్ కూడా ఈ రంగులు, ఫొటోల ఫ్యాంటసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
తాజాగా ‘వైస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష’ పథకం నేపథ్యంలో జగన్ రంగుల కలలు, ఫొటువాల ఫ్యాంటసీలు మరోసారి తీవ్రస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇక, ఈ పథకం ట్యాగ్‌లైన్ ‘మీ భూమి.. మా హామీ’ అంటూ త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ టైపులో పెట్టడం విశేషం. ఈ పథకం ద్వారా చేపట్టిన రీ సర్వే భూమి రికార్డులు. పాస్ పుస్తకాల కవర్ పేజిలలో జగన్ ఫొటోలు ‘శాశ్వతం’గా ఉండేలా ముద్రిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇక, మంత్రి, అధికారుల ఫొటోలు వాటికి అదనం. దీంతో, ఎవడి అస్తి మీద..ఎవరి ఫోటో ? జగన్ రెడ్డి..? అంటూ సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. మా నాయనకేమైనా పుట్టిండా మా అస్తి పత్రాల మీద ఫోటో వేయించుకోవడానికి అని ??? నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భూములు రైతులకు కష్టార్జితంగా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తి అని, వాటికి రికార్డులు, రిజిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వం చట్టబద్ధత మాత్రమే కల్పిస్తుందని అంటున్నారు.
ఈ రీసర్వేలో అత్యంత కీలకమైన ఎల్పీఎమ్ రికార్డుల్లో సైతం జగన్ ఫొటువా ముద్రిస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత భూముల సర్వే చేస్తున్నామని, ఇకపై ఏపీలో భూ వివాదాలు ఉండవని చెప్పిన జగన్…ఈ సర్వేను ఈ ఫొటోల వివాదంతో మొదలెట్టడం విశేషం. రైతుల భూములకు ‘ప్రభుత్వ హామీ’ అని ఉండాలని, ‘మా హామీ’ అంటే..వైఎస్సార్, జగన్, అధికారుల హామీ అని అర్థం వచ్చేలా ఎలా రాస్తారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇక, సర్వే కోసం ఉపయోగించే సరిహద్దు రాళ్లపై కూడా అన్న ఫొటోలు ముద్రించబోయారు. అయితే, శిలలపై జగనన్న చిత్రాలు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై తీవ్ర విమర్శలు రావడంతో రాళ్లపై ఫొటోలను విరమించుకున్నారు. అక్కడ మిస్సయింది కాబట్టి..రీ సర్వే అనంతరం రైతులకు ఆర్ఓఆర్ చట్టం కింద ఇచ్చే భూమి హక్కుల పత్రం (పాస్ పుస్తకం)లో కవర్ పేజీ, వెనుక పేజీలపై జగన్ కలర్ ఫొటో మెరిసేలా ప్లాన్ చేశారు.
ఇఖ, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎమ్)లను కలిపి ఒక పుస్తకంగా ముద్రించి అందులో కవర్ పేజీ, వెనుక పేజీ, లోపలి పేజీల్లోనూ జగనన్నను దర్శించుకునేలా ఫొటోలు ముద్రించారు. ప్రతి గ్రామంలో కనీసం ఐదారు ఎల్పీఎమ్ పుస్తకాలు ముద్రిస్తారు. రేపు ప్రభుత్వం మారినా శాశ్వత రికార్డులైన ఎల్పీఎమ్ లను మార్చడానికి వీల్లేదు. కొత్త ప్రభుత్వం నచ్చినట్లుగా పాస్‌పుస్తకాలు మార్చుకోవచ్చు. ఇప్పటికే ప్రింటింగ్ కూడా పూర్తయిన ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. మరి, దానిని అలాగే కొనసాగిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.