ఏపీ సీఎంగా త్వరలోనే రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పుడు సర్వేలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. జగన్ చేయించుకున్న సర్వేలోనే వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలు రాగా.. ఇప్పుడు వైసీపీ రెబల్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేయించిన సర్వే ఆ పార్టీని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. రఘురామరాజు చేయించిన సర్వే ఫలితాలను ఆయన విడుదల చేయకున్నా.. అంతిమ ఫలితాలను మాత్రం వెల్లడించారు. ఈ సర్వేలో జగన్ పార్టీకి కనీసం 50 సీట్లు కూడా రావని తేలిపోయిందట. ఈ మేరకు సోమవారం నాడు రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పార్టీ టికెట్ పైనే ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన రఘురామరాజు.. తెలుగు మీడియంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఓ సారి భేటీ అయిన ఆయన తన మనసులోని మాటను బయటపెట్టానని ఏదో అలా కవర్ చేసుకున్నారు గానీ.. ఆ తర్వాత విపక్షాల కంటే కూడా జగన్ పై రఘురామనే ఓ రేంజిలో విరుచుకుపడుతున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కక్షసాధింపు అన్నట్లుగా జగన్ సర్కారు తనను అరెస్ట్ చేయడంతో రఘురామ దాదాపుగా బరస్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ప్రతి అంశంపైనా తనదైన శైలి ఘాటు వ్యాఖ్యలతో జగన్ అండ్ కోపై విరుచుకుపడుతున్న రఘురామ.. తాజాగా తాను చేయించిన సర్వే ఫలితాలు ఇవి అంటూ సోమవారం సంచలన విషయాలు వెల్లడించారు.
రఘురామ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్ నేతృత్వంలోని వైసీపీకి 50 సీట్ల కంటే తక్కువే వస్తాయట. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పుంగనూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిలు మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా గెలవరట. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే.. భీమవరం, కోవూరు, నిడదవోలు ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీనివాస నాయుడులు మినహా ఏ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గెవలరట. ఇక నరసాపురం పార్లమెంటులో జగన్ కంటే తానే పాపులర్ అని చెప్పిన రఘురామ.. తన గెలుపు ఖాయమేనని చెప్పారు.