అమరావతిలోని R3, R5 జోన్ ల భూముల వ్యవహారంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. R5 జోన్ లో జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం, ఆ భూములను పంచొచ్చు అంటూ కోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల నుంచి దీనిపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. వాస్తవానికి R3 జోన్ లో రైతులకు రిటర్నబుల్ ప్లాట్ లు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉంది.
ఆ జోన్ లో రైతులకు ఫ్లాట్ లు ఇవ్వగా మధ్యలో చాలా ఎకరాల భూమి మిగిలే ఉంటుంది. ఆ భూమిని జగనన్న ఇళ్ల స్థలాలకు ఇస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. కానీ, ఆ జోన్ లో నిబంధనల ప్రకారం అమరావతి లో ఇల్లు కట్టుకోవడానికి కనీసం 120 గజాల స్థలం అంటే దాదాపు రెండున్నర సెంట్ల స్థలం ఉండాలి. అయితే, జగనన్న ఇళ్ల కోసం ఇచ్చే స్థలం విస్తీర్ణం కేవలం ఒక సెంటు. దీంతో, అక్కడ భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు.
అదీగాక, అక్కడ పేదలకు ప్లాట్లు ఇచ్చి డెవలప్ చేస్తే….రైతుల ప్లాట్లు కూడా డెవలప్ చేయాలి. అందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో, అమరావతి ప్రాంతంలో పరిశ్రమల కోసం, అభివృద్ధి కోసం, విద్యాసంస్థలు కోసం,భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన 1400 ఎకరాల భూముల్లో R5 జోన్ ను కొత్తగా సృష్టించింది. అక్కడ పేదలకు 48 గజాల్లో ఇళ్ళ స్థలాలు ఇస్తుంది. అమరావతిలో ఈ జోన్ ను మురికివాడగా మార్చే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.