వైసీపీ అధినేత, సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి ఆయన సతీసమేతంగా లండన్ పర్యటనకు వెళ్లాలి. కానీ, అనూ హ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఈ నెల ఆఖరులో జగన్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అయితే.. పర్యటనకు వెళ్తున్నారు సరే.. మరి ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది.
లండన్ పర్యటనకు సంబంధించి అనుమతి కోరుతూ ఈ నెల 10న జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించి అనుమతించాల ని కోరారు. జగన్ పిటిషన్పై ఈ నెల 17న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 21నుంచి 29 తేదీ వరకు లండన్ వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీబీఐ అనుమతించింది.
ఇక, సీబీఐ కోర్టు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కీలకమైన షరతులు విధించింది. విదేశాలకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్, ఈ- మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు, ఎక్కడ బస చేస్తారు… ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారు.. ఎవరిని కలుస్తున్నారు.. వంటి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్ను ఆదేశించింది.
ఇదిలావుంటే, జగన్ పర్యటనకు అయ్యే ఖర్చుపై నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. జగన్ అధికారిక హోదాలో వెళ్తున్నారా.. లేక వ్యక్తిగతంగా వెళ్తున్నారా? అనేది తేల్చి చెప్పాలని నెటిజన్ ఒకరు కామెంట్ చేశారు. దీనికి మరికొందరు జత కలిసి.. ఖర్చును ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వమా? జగన్ సొంత ఖర్చా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చే అయితే.. ఇప్పటికే అప్పుల్లో ఉన్న సర్కారు.. మరింత అప్పల పాలు అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.