పోలవరం ప్రాజెక్టు విషయంపై.. అసెంబ్లీలో సోమవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభు త్వ నిర్వాకం కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అంతేకాదు.. కాంట్రాక్టర్ను మార్చడంతోపాటు.. కమీషన్ల కోసం.. కక్కుర్తి పడడంతోనే.. ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందన్నారు. ఇదేసమయంలో పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంపైనా.. జగన్ స్పందించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
పోలవరం నిర్వాసితులకు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 లక్షల వరకు ప్యాకేజీ ఇస్తామని చెప్పారన్నారు. అయితే.. ఇప్పటి వరకు పది లక్షలు ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు పది లక్షల రూపాయలు ఇస్తామని.. ఎన్నికలకు ముందు.. జగన్ చెప్పారని అన్నారు. ఈ మేరకు నిధులు ఇవ్వకుండా..నిర్వాసితుల పొట్టకొడుతున్నారని అన్నారు.
దీనిపై జలవనరుల మంత్రి.. అంబటి రాంబాబు స్పందించారు. బుచ్చయ్య చౌదరి ప్రసంగానికి అడ్డు పడిన మంత్రి.. గతంలో జగన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. పైగా.. బాధిత నిర్వాసితులకు ఆరు న్నర లక్షలు ఇస్తామని.. గత ప్రభుత్వం చెప్పిందని.. అవి ఇవ్వకుండా.. ప్రభుత్వం వెళ్లిపోయిందని.. ఆ భారం ఇప్పుడుతాము భరిస్తున్నామని.. రాంబాబు వ్యాఖ్యానించారు. గతంలో జగన్ పది లక్షలు పరిహా రంగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అంతేకాదు.. ఆధారాలు ఉంటే.. చూపాలని సవాల్ చేశారు.
కట్ చేస్తే.. ఎన్నికలకు ముందు.. పోలవరం ప్రాంతంలో పర్యటించిన జగన్.. అక్కడి నిర్వాసితులతో మాట్లాడిన వీడియో.. ఒకటి వెంటనే వైరల్ అయింది. ఈ వీడియోలో జగన్ మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు.. చంద్రబాబు ఆరున్నర లక్షల పరిహారమే ఇస్తున్నారని.. ఇది ఏమాత్రమూ సరిపోదని.. వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అనేక మంది రైతులు తన దగ్గర మొర పెట్టుకున్నారని చెప్పారు. అందుకే.. తమ ప్రభుత్వం ఏర్పడగానే.. పది లక్షల పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు మంత్రి అంబటి మాత్రం.. అసలు ఆమాటే అనలేదని అంటున్నారు. ఇదీ.. సంగతి!!