రాబోయే సెప్టెంబర్‌లో విశాఖపట్నంకు జగన్మోహన్ రెడ్డి ఫిష్టవ్వాలని డిసైడ్ అయ్యారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగానే జగన్ విశాఖపట్నంకు మారబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జగనే ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపాడు (భావనపాడు)పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమపథకాలను వివరించారు. ప్రతిపక్షాలు తనను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాయో చెప్పారు. తన వల్ల మంచి జరిగిందని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు తనకే ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.
సరే ఇదంతా రాజకీయంగా రెగ్యులర్ గా జగన్ చెబుతున్నదే. విశాఖపట్నం నగరం రాష్ట్రమంతటికీ ఆమోదయోగ్యమైన నగరంగా జగన్ చెప్పారు. అందుకనే తాను సెప్టెంబర్ నుండి విశాఖలోనే తాను కాపురం ఉండబోతున్నట్లు ప్రకటించారు. చూడబోతే విశాఖకు ఫిష్టయ్యే విషయంలో జగన్ గట్టిగానే డిసైడ్ అయినట్లున్నారు. ఒకవైపు మూడురాజధానుల మీద సుప్రింకోర్టులో కేసు నడుస్తోంది. జగన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అయినా జగన్ మాత్రం తన నిర్ణయం ప్రకారమే ముందుకెళ్ళాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రకటన చూసిన తర్వాత రెండు విషయాలు అర్ధమవుతున్నది. మొదటిదేమో మూడురాజధానులపై సుప్రింకోర్టు తీర్పు ప్రభుత్వానికి సెప్టెంబర్‌లోపు అనుకూలంగా వస్తుందన్ని అనుకుంటున్నట్లున్నారు. ఇక రెండోదేమిటంటే సుప్రింకోర్టు తీర్పు ఎలాగున్నా సరే తాను మాత్రం విశాఖకు మారిపోవాలని. అధికారికంగా విశాఖను రాజధానిగా ప్రకటించాలంటే కోర్టు కేసు అడ్డొస్తుంది. కోర్టులో కేసుండగా ఆ విషయాన్ని జగన్ ప్రకటించలేరు.
అందుకనే రాజధాని తొందరలో విశాఖకు మారబోతోందని గతంలో ప్రకటించింది. అయితే ఇపుడు మాత్రం తాను విశాఖలో సెప్టెంబర్ నుండి కాపురం పెట్టబోతున్నట్లు చెప్పారు. అంటే సీఎం క్యాంపు ఆఫీసును జగన్ మార్చేసుకోబోతున్నారు. దీనికి ఎవరి అనుమతి అవసరంలేదు. ఎవరు కూడా జగన్ విశాఖకు షిఫ్టవ్వటాన్ని కోర్టుల్లో సవాలు చేయలేరు. అందుకనే తాను ముందుగా విశాఖపట్నంకు మారిపోవాలని డిసైడ్ అయినట్లున్నారు. లేకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించరు. నోటికేదొస్తే దాన్ని మాట్లాడేసే రకంకాదు జగన్. అన్నీ ఆలోచించుకునే కచ్చితమైన ప్రకటన చేశారు. మరి సుప్రింకోర్టులో కేసు ఏమవుతుందో చూడాలి.