ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త మాట తరచూ వినిపిస్తోంది. అదే.. క్లాస్ వార్. పాత విషయాల్ని కొత్తగా చెప్పే టాలెంట్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువే. అంతేనా.. లేనివి ఉన్నట్లుగా.. ఉన్నవి లేనట్లుగా.. తెల్లనివన్ని పాలు కావని.. నల్లనివన్నీ నీళ్లు కావన్న నిజాలకు సీఎం జగన్ మాటలు కాస్త దూరంగా ఉంటాయి. క్లాస్ వార్ కు కోడి కత్తి కేసుకు లెక్కేంటి? పోలికేంటి? ఇదంతా జగన్ లాంటి అత్యుత్తమ ముఖ్యమంత్రి మీద కుళ్లుతోనూ.. కుతంత్రంతోనే చేసే దాడి? అంటూ ఆవేశాలకు పోయే వారు కనిపిస్తారు.
అయితే.. విషయం ఏదైనా కాస్తంత నిమ్మళంగా చూస్తే నిజాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి.
క్లాస్ వార్ గురించి మాట్లాడుకోవటానికి ముందు కోడికత్తి కేసు గురించి మాట్లాడుకోవాల్సిందే. జగన్ ను అమితంగా అభిమానించి.. ఆరాధించిన ఒక కుర్రాడు.. తన అభిమాన నేత ముఖ్యమంత్రి కావాలంటే ఏదో ఒక సంచలనానికి పాల్పడాలన్న ప్లాన్ తో.. గాయం మాత్రం చేసే శక్తి ఉన్న కోడికత్తిని తీసుకొని.. దాన్ని భద్రంగా దాపెట్టి.. గురి చూసి.. ఎక్కడా లెక్క తేడా రాకుండా భుజం మీద మాత్రమే గాయం అయ్యేలా దాడి చేయటం తెలిసిందే. ఈ ఉదంతం కాస్తా జగన్ మీద హత్యాయత్నం అంటూ ఆగమాగం చేసేసి.. విశాఖ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో బోలెడన్ని ఆసుపత్రులు ఉంటే.. వాటిని వదిలేసి.. విమానంలో హైదరాబాద్ కు వచ్చి..అక్కడ చికిత్స తీసుకోవటం.. ఈ సందర్భంగా నెలకొన్న పరిణామాల గురించి తెలిసిందే.
కోడి కత్తి ఎపిసోడ్ ను చూస్తే.. గాయపడింది జగన్ అయితే.. గాయం చేసింది జగన్ అభిమాని. మరి.. మంచో, చెడో ఈ కేసు లెక్కను తేల్చేయాలి కదా? లేదంటే.. మనసున్న జగన్ సదరు కోడికత్తి వీరుడికి క్షమాభిక్ష పెట్టాలి కదా? లేదంటే కఠినంగా శిక్షించాలి. కానీ.. అదేమీ చేయకుండా.. చివరకు ఆ కేసు విచారణకు హాజరు కాకుండా జగన్ ఏం చేయాలనుకుంటున్నారు? కోడికత్తి ఎపిసోడ్ తో అవసరమైనంత సానుభూతిని సొంతం చేసుకున్న వైనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే.. తాను ఎంతో అభిమానించే బాధితుడి కోసం.. ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూద్దామన్న ఉద్దేశంతోనే తానీ నేరానికి పాల్పడినట్లుగా బాధ్యుడు చెప్పటం.. అతని కోరికకు తగ్గట్లే జగన్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే.
కోడికత్తి కేసును పక్కన పెట్టేద్దాం. క్లాస్ వార్ లోకి వచ్చేద్దాం. ఇదేమీ కొత్త పదం కాదు. శతాబ్దాలుగా సమాజాన్ని పట్టి పీడించే అంశం. కాకుంటే వర్గపోరు అని మనం తెలుగులో అనుకునే మాటను ఇంగిలీషులో క్లాస్ వారుగా పేర్కొంటూ.. అదేదో కొత్త విషయాన్ని సరికొత్తగా జనాలకు చెప్పినట్లుగా సీఎం జగన్ మాట్లాడుతుంటారు. తనను అభిమానిస్తూ.. ఆరాధించే నిరుపేద అక్కాచెల్లెళ్ల కోసం.. అన్నదమ్ముల కోసం.. తల్లుల కోసం వారి బిడ్డగా ఉన్న ముఖ్యమంత్రి జగన్.. వారి ఆర్థిక పరిస్థితిని మాయం చేయటానికి వీలుగా ఎప్పటికప్పుడు బటన్లు నొక్కుతూ.. అవినీతికి అవకాశం లేకుండా వారి ఖాతాల్లోకి డబ్బులు వేసే వినూత్న కార్యక్రమాన్ని షురూ చేశారు.
ఎప్పటికప్పుడు ఏదో ఒక పేరు మీద.. ఏదో ఒక వర్గానికి బటన్ నొక్కేస్తూ.. లబ్థిదారులకు డబ్బులు అందేలా చేయటం. సమాజంలో క్లాస్ వార్ ను తగ్గించాలంటే ఏం చేయాలి? పేదరికాన్ని రూపుమాపాలంటే ఏం చేస్తే మారుతుంది? డబ్బులు వారి ఖాతాల్లోకే వేసి.. వారి బతుకుల్ని మార్చటమా? లేదంటే.. వారికి వారు వారి ఖాతాల్లో డబ్బులు వచ్చి పడేలా ఉపాధి కల్పించటమా?
నిత్యం ప్రభుత్వం మీద ఆధారపడుతూ.. బటన్ నొక్కితే కానీ డబ్బులు తమ ఖాతాలో పడని దైన్యంతో శతాబ్దాలుగా ఉన్న క్లాస్ వార్ కు చరమగీతం పాడొచ్చా? కోడి కత్తి కేసులో తాను అభిమానించే జగన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆశతో దాడి చేసిన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అదే రీతిలో తాను బటన్ నొక్కటం ద్వారా సమాజంలో క్లాస్ వార్ ను తగ్గించే ప్రోగ్రాం తాను చేపట్టినట్లుగా చెప్పే జగన్ మాటలు కూడా ఇదే రీతిలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కోడికత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్ లబ్థి పొందితే.. క్లాస్ వార్ పేరుతో బాధితుల పక్షాల నిలిచి.. వారికి అండగా ఉంటూ వారి పేదరికాన్ని కూకటివేళ్లతో పెకలించేలా చేస్తానని చెప్పే జగన్ మాటల్ని చూస్తే.. ఒక్క విషయం అర్థమవుతుంది. అది కోడికత్తి అయినా క్లాస్ వార్ అయినా లబ్థి పొందేది.. లాభం చేకూరేది జగన్ కు మాత్రమేనని.