ఏపీలో అధికార పార్టీ వైసీపీకి సర్వేలు.. సమాచారం అందించే వ్యవస్థకు ఐప్యాక్ పేరున్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి సమాచారం సేకరించి.. పార్టీపరిస్థితిపై అంచనా వేసి.. నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును ఎప్పటికప్పుడు పార్టీకి అందించే ఈ వ్యవస్థ పూర్తిగా ప్రైవేటుదేనని ఇప్పటి వరకు ప్రచారంలో ఉంది. పార్టీ నిధుల నుంచే ఈ ఐప్యాక్ సిబ్బందికి వేతనాలు అందుతున్నాయని కూడా చర్చ సాగుతోంది.
అయితే.. తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఐప్యాక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐప్యాక్ సిబ్బందినే సర్కారులో ఇతర ఉద్యోగులుగా చూపిస్తున్నారని టీడీపీ పేర్కొంది. అంతేకాదు.. ఈ సిబ్బందికి డేటా ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని జీతాల రూపంలో చెల్లిస్తున్నారని ఆరోపించింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.
రామ్ ఇన్ఫో, యూనీ సొల్యూషన్స్, పీకే సొల్యూషన్స్, ఉపాధి టెక్నో, సిటిజెన్స్ ఉద్యోగులు ఐప్యాక్ సిబ్బందే అన్నది టీడీపీ చెబుతున్న మాట. అంతేకాదు.. రామ్ ఇన్ఫో డైరెక్టర్లు జయేశ్రావు, పూర్ణదుర్గ వంటివారు ఐప్యాక్ మాజీ ఉద్యోగులేనని.. వీరికి ప్రభుత్వం నెల నెలా వేతనాలు ఇస్తోందని, కొందరికి ఆరుమాసాలకు ఒకసారి ప్యాకేజీ రూపంలో నిధులు ఇస్తోందని టీడీపీ పేర్కొంది. డేటా సేకరణకు ఏటా 69 కోట్ల రూపాయలను ఈ సంస్థలకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారని టీడీపీ నేత విజయ్‌కుమార్ ఆరోపించారు.
ఇప్పటి వరకు వలంటీర్ వ్యవస్థ ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని ఈ సంస్థలకు అందిస్తున్నారని.. ఈ సంస్థలు డేటాను వేరే చోట నిక్షిప్తం చేస్తున్నాయని టీడీపీ నేత చెబుతున్న మాట. ఏదేమైనా కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతున్న డేటా చౌర్యం, డేటా దుర్వినియోగం, డేటా నిక్షిప్తం వంటివాటిపై.. పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. మరి ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో చూడాలి.