ఏపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నాయి. సీఎం జగన్ను కార్నర్ చేసుకుని విమర్శల శరాలను సంధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వం … `2-డి` సర్కార్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ టీడీపీ అబ్యర్థి వెనిగండ్ల రాము కోసం ఆయన ప్రచారం చేశారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలని పిలుపునిచ్చారు. మదమెక్కిన ఏనుగును దారిలోకి తెచ్చుకునేందుకు ఓటు అనే అంకుశాన్ని వినియోగించాలని పిలుపునిచ్చారు.
గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పేకాట క్లబ్బులు, దందాలపై ఉన్న శ్రద్ధ… ప్రజలకు తాగునీరు అందించడంలో లేదని కొడాలిపై విమర్శలు గుప్పించారు. మనుషులకు స్వేచ్ఛ, భద్రత లేకుండా వైసీపీ చేసిందన్నారు. ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన ప్రభుత్వం ఇదేనని దుయ్యబట్టారు. బీసీలపై అక్రమంగా 9 వేల కేసులు పెట్టారని అన్నారు. వైఎస్ఆర్ కంటే చాలా మంది మహానుభావులు ఈ నేల మీద పుట్టారన్న పవన్.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు ఆ మహానుభావుల పేర్లు పెడతామని చెప్పారు.
“అధికార పీఠం మనదే.. వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడదాం జగన్ 2-డి(దాడులు, దోపిడీలు) ప్రభత్వాన్ని పడగొడదాం“ అని పవన్ పిలుపునిచ్చారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్నట్లు జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేశారని అన్నారు. అప్పటికే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఉన్నప్పుడు దాన్ని తీసేయాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. “అదేనా ఆయనకు మీరిచ్చే గౌరవం?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల ఆస్తులు కాజేయాలని వైసీపీ నేతలు చూస్తున్నార“ని అన్నారు.
ప్రజలు తమ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వెనిగండ్ల రాము నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక రాక్షసుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడని.. స్వేచ్ఛను హరించాడని అన్నారు. దాడులు దోపిడీల 2డీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కొడాలి వంటి వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని పవన్ పిలుపునిచ్చారు.