చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా తడబడుతోంది. ఒకసారి తాను తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తు మళ్ళీ దానికి వ్యతిరేకంగా నడుచుకుంటోంది. దీన్ని జనాలు తుగ్లక్ చర్యలని చెబుతుంటారు. ఇంతకీ విషయం ఏమిటంట మహిళా కమీషన్ కాలపరిమితి విషయంలో జగన్ ప్రభుత్వంది తుగ్లక్ చర్యగానే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి మహిళా కమీషన్ పదవీకాలం ఐదేళ్ళు. ఇదే పద్ధతిలో జగన్ కూడా కొత్తగా మహిళా కమీషన్ కు ఛైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మను నియమించారు. ఆమెతో పాటు సభ్యులను కూడా అపాయింట్ చేశారు.
అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో సడెన్ గా కమీషన్ కాలపరిమితిని రెండేళ్ళకు కుదించారు. ఈ మేరకు బిల్లును అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టంలో సవరణలు కూడా పూర్తయి కొత్త చట్టం ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉంది. అంతే తాజా చట్టం ప్రకారం కమీషన్ కాలపరిమితి రెండేళ్ళు మాత్రమే. కొత్తచట్టం ప్రకారం ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, సభ్యుల కాలపరిమితి ఎప్పుడో అయిపోయింది.
అయినా ఛైర్ పర్సన్, సభ్యురాలుగా వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. దీనిపై మీడియాలో తాజాగా గోల మొదలైంది. దాంతో ప్రభుత్వం ఉలిక్కిపడి కమీషన్ కాలపరిమితిని మళ్ళీ ఐదేళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి ఇపుడున్న సభ్యురాళ్ళనే కంటిన్యు చేయదలచుకుంటే వీళ్ళని కొత్తగా అపాయింట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేస్తే సరిపోతుంది. అలాకాదని ఐదేళ్ళ కాలపరిమితిని రెండేళ్ళకు కుదించటం ఎందుకు ? కాలపరిమితి తీరిపోయినా సభ్యులను కంటిన్యూ చేయటం ఎందుకు ?
కొత్తగా నియమించకుండానే పాత ఛైర్ పర్సన్, సభ్యురాళ్ళని ఎలా కంటిన్యూ చేస్తారు ? ఇదంతా వెలుగులోకి వచ్చిన తర్వాత హడావుడిగా మళ్ళీ కమీషన్ కాలపరిమితి ఐదేళ్ళంటు మరో నోటిఫికేషన్ ఇవ్వటం ఎందుకు ? కాలపరిమితి తీరిపోయిన వాళ్ళని తిరిగి నియమిస్తే సరిపోతుంది కదా. చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసుకుని ప్రభుత్వం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నదో అర్ధంకావటంలేదు.