ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశించింది. అయితే, కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు,సీబీఐ అధికారులు పలుమార్లు గడువు కోరారు.
ఈ క్రమంలోనే జగన్, సీబీఐ అధికారులకు లాస్ట్ చాన్స్ ఇచ్చిన కోర్టు…జూన్ 1లోపు కౌంటర్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని డెడ్ లైన్ విధించింది. ఒకవేళ జూన్ 1నాటికి కౌంటర్ దాఖలు చేయకపోతే పిటిషన్ ను నేరుగా విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని, లాక్ డౌన్ తో సహా వివిధ కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేకపోయామని జగన్ తరఫు లాయర్లు చెప్పారు.
అయితే, ప్రతివాదులకు జరిమానా విధించాలని రఘురామ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జగన్ భవితవ్యం తేలేందుకు మరో 3 రోజులు మాత్రమే గడువు ఉంది. మరి, ఈ సారి గడువు కోరే అవకాశం లేకపోవడంతో…కచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, బీజేపీతో సత్సంబంధాలు నెరుపుతోన్న జగన్ బెయిల్ వ్యవహారం కేంద్రంలోని పెద్దల సూచనల ప్రకారమే మలుపు తిరుగుతుందన్న టాక్ వస్తోంది. కాబట్టి, కేంద్రం నిర్ణయాన్ని తోసిరాజని జగన్ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరడం సంచలనం అవుతుంది. కాబట్టి మధ్యే మార్గంగా బెయిల్ పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలేయడం సీబీఐ ముందున్న మరో ఆప్షన్. అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటిస్తే…జూన్ 1వ తేదీన నేరుగా పిటిషన్పై విచారణ మొదలువుతుంది.
అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అడిగిన వివరాలను సీబీఐ అధికారులు సమర్పించి తమకు ఇబ్బంది లేకుండా చూసుకునే చాన్స్ ఉంది. త్వరలో జగన్ బెయిల్ రద్దవుతుందని తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ విషయంలో కేంద్రం వైఖరి ఏమిటన్నది తేలాలంటే మరో 3 రోజులు వెయిట్ చేయక తప్పదు.