విషయం ఏదైనా నాన్చకుండా.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేయటం ఒక ఎత్తు. అదే సమయంలో.. తాను తీసుకున్న నిర్ణయంలోని లాజిక్ ను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పటంలోనూ సీఎం జగన్ చాలా క్లారిటీతో ఉన్నట్లుగా చెబుతారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య.. డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి.. చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బాలచంద్రారెడ్డిలు తాడేపల్లికి వెళ్లారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూళ్లూరుపేట అభ్యర్థిత్వం గురించి మాట్లాడిన ఎమ్మెల్యే సంజీవయ్య.. వచ్చే ఎన్నికల్లో ఆ సీటుకు వస్తారని ప్రచారం జరుగుతున్న డాక్టర్ గోపీనాథ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆయన్ను పోటీకి దించితే గట్టి పోటీ ఇవ్వలేరు’’ అని చెప్పగా.. ఆ వెంటనే స్పందించిన జగన్ గోపీనాథ్ అభ్యర్థి అని ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సంజీవయ్య.. అలా అనుకుంటున్నట్లుగా తెలిసిందన్న మాటను చెప్పగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిస్పందించారు.
‘‘మిమ్మల్ని సత్యవేడుకు పంపి.. మీ స్థానంలోకి తిరుపతి ఎంపీ గురుమూర్తిని సూళ్లూరుపేటకు తేవాలని అనుకుంటున్నాం’’ అని చెప్పగా.. తనకు తమిళం రాదని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది. సంజీవయ్యకు తమిళం వచ్చని తాను అనుకున్నట్లుగా చెప్పిన జగన్.. ‘‘మిమ్మల్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
తనను కేవలం నలుగురు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న ముఖ్యమంత్రి.. ఆ నలుగురు చాలు ఓడించేందుకన్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ‘గెలిపించుకోవటం చాలా కష్టం. ఓడించడం చాలా సులువు’’ అంటూ.. మిగిలిన విషయాలు ధనుంజయ్ రెడ్డితో మాట్లాడాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి – ఎమ్మెల్యే సంజీవయ్య మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది.