జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎంత మంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే అని జగన్ అండ్ కో బలంగా నమ్ముతుంటారు. హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో పవన్.. చంద్రబాబు వైపు లేకుంటే తమకే విజయం దక్కేదన్నది వారి నమ్మకం.
అందుకే పవన్ మీద అప్పట్నుంచి తీవ్రమైన ద్వేష భావాన్ని చూపిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు ప్రధానంగా వాడే ఆయుధాలు రెండు. పవన్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఆయనకు సపోర్ట్ చేశారని. అలాగే పవన్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ఆయనకు మూడు పెళ్లిళ్లు జరగడం గురించి కూడా తరచుగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల ముందే ఈ స్క్రిప్టు అరిగిపోయినా.. ఇప్పటికీ దాన్నే వాడుతూ ఉంటారు వైసీపీ నేతలు.
జగన్ సైతం పవన్ పేరెత్తకుండా.. ఆయన్ని చంద్రబాబుకు దత్త పుత్రుడు అని.. ప్యాకేజీ తీసుకున్నాడని విమర్శించడం.. ఆయన పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడం తరచుగా చేస్తుంటారు. తాజాగా అమ్మఒడి కార్యక్రమంలో జగన్ ఇదే శైలిలో విమర్శలు చేశారు. ‘‘దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్ ఇప్పుడు ఒక లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. దత్తపుత్రుడిలా మనం తొడలు కొట్టలేం.
బూతులు తిట్లలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే బంధాన్ని రోడ్డు మీదికి తీసుకురాలేం. వారిలా ఆ పనులు మనం చేయలేం. ఇవన్నీ దత్తపుత్రుడికి పేటెంట్’’ అని జగన్ వ్యాఖ్యానించారు. ఐతే స్కూల్ పిల్లలకు అమ్మవొడి ఇచ్చే కార్యక్రమంలో జగన్ ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం.. పవన్ గురించి అరిగిపోయిన రికార్డునే మళ్లీ వినిపించడం విమర్శలు వస్తున్నాయి.