ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కల్తీ సారా అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలివ్వలేని వైసీపీ సభ్యులు…టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసి తప్పించుకుంటున్నారు. అసలు అవి సహజ మరణాలని, సారా తాగి చనిపోతే తమకేం సంబంధమని చెప్పిన వైసీపీ నేతలు…చివరకు ఆ కల్తీ, నాటు సారా వ్యవహారాలపై కొత్త భాష్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే కల్తీ సారా, నాటు సారా తయారీపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
అసెంబ్లీలో తమ సభ్యుల తీరును పరికించుకోని జగన్… టీడీపీ సభ్యుల తీరుపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, కల్తీ సారా మరణాలపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలు సరికాదంటూ తమ సభ్యుల వాదనను మాత్రం సమర్థించుకున్నారు. అసలు జంగారెడ్డిగూడెంలో సారా కాయడం సాధ్యపడుతుందా..? అని జగన్ ప్రశ్నించడం ఆయన స్పీచ్ మొత్తానికే కొసమెరుపు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే నమ్మేలా ఉండాలని చెప్పిన జగన్…తాను చెప్పే దాంట్లో మినిమమ్ లాజిక్, నిజం ఉండాలన్న సంగతి మరచిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి, గోబెల్స్ ప్రచారం, విష ప్రచారం జరుగుతోందని, జరగని ఘటనను జరిగిందని చూపిస్తున్నారని జగన్ అంటున్నారని, కానీ, నాటు సారా కాస్తున్న విషయాన్ని మాత్రం కప్పిబుచ్చడానికి చూస్తున్నారన్న విషయం మరిచిపోతున్నారని పంచ్ లు వేస్తున్నారు.
సారా కాచేవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, అటువంటిది, 55 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఎవరైనా సారా కాస్తారా? అంటూ జగన్ వేసిన ప్రశ్న…చెప్పిన థియరీ ఈ రోజు సెషన్ కే హైలైట్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యం కాదంటూ జగన్ చెప్పిన లాజిక్కు రామ్ గోపాల్ వర్మకు కూడా అంతుబట్టదనడంలో ఎటువంటి సందేహం లేదని ట్రోల్ చేస్తున్నారు. కల్తీ సారా, నాటు సారా కాయాలంటే జనాభా ఇంతమందే ఉండాలని రాజ్యాంగంలో రాశారా జగన్ అంటూ…నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నాటు సారా తాగిస్తే ప్రభుత్వ ఆదాయమే తగ్గుతుందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు మద్యం వల్ల తన ప్రభుత్వం నడుస్తుందనడానికి నిదర్శనమని నెటిజన్లు దుయ్యబడుతున్నారు.